రేటింగ్: 2.25/5
నువ్వు పొట్టిగా ఉన్నావ్, లావుగా ఉన్నావ్, నల్లగా ఉన్నావ్..
ఇలాంటివన్నీ నిజాలు. దాన్ని ఎవరూ మార్చలేరు.
‘నువ్వు అందంగా ఉన్నావ్’ –
అన్నది అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే అందం అనేది ఒకరి దృష్టిలో ఒక్కోలా ఉంటుంది.
కానీ మనం మాత్రం నిజాన్ని కవర్ చేసి, కేవలం అభిప్రాయాల కోసం బతికేస్తున్నాం. ఆత్మనూన్యతా భావం కూడా ఓ జబ్బే. దానికి మందు కూడా వాళ్ల దగ్గరే ఉంటుంది. ఎవరికి వాళ్లు ఈ నిజం తెలుసుకుని అందులోంచి బయటపడాలంతే. ఇదే మాటని నవ్విస్తూ, నవ్విస్తూ.. జ్ఞానబోధ చేసేలా చెప్పిన సినిమా `101 జిల్లాల అందగాడు`.
కేఎస్ఎన్ అని పిలుచుకునే గుత్తి సూర్య నారాయణ (అవసరాల శ్రీనివాస్) చూడ్డానికి అందంగానే ఉంటాడు. మంచి ఉద్యోగం కూడానూ. కాకపోతే బట్టతల. ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే.. నవ్విపోతారని విగ్గుతో బట్టతల కవర్ చేస్తుంటాడు. విగ్గులేనిదే బయటకు రాడు. రాలేడు. ఇంట్లో కూడా క్యాప్ పెట్టుకుని తిరుగుతుంటాడు. బట్టతల కారణంతోనే కేఎస్ఎన్కి పెళ్లికాదు. కేఎస్ఎన్ ఆఫీసులోకి అంజలి (రుహానీ శర్మ) కొత్తగా చేరుతుంది. కేఎస్ఎన్ మాటతీరు, తన ప్రవర్తన అంజకి బాగా నచ్చుతాయి. కేఎస్ఎన్ ని తను ఇష్టపడుతుంది. ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది. కానీ తనది బట్టతల అని తెలిస్తే.. అంజలి దూరం అయిపోతుందేమో అన్నది కేఎస్ఎన్ భయం. ఈ నిజాన్ని అంజలికి చెప్పాలనుకుంటాడు గానీ, చెప్పలేడు. మరి ఈ నిజం అంజలికి తెలిసిందా? తెలిస్తే… ఎలా ఫీలైంది? కేఎస్ఎన్ ఆత్మనూన్యతా భావం ఎప్పుడు ఎలా పోయింది? ఇదంతా మిగిలిన కథ.
హిందీలో `బాలా` అనే ఓ సినిమా వచ్చింది. అది కూడా ఇలాంటి కథే. బాలాకీ మా సినిమాకీ సంబంధం లేదంటూ అవసరాల శ్రీనివాస్ చెప్పొచ్చు గాక. కానీ… ఇలాంటి కథ డీల్ చేయగలిగే ధైర్యం ఇచ్చింది..ఆ సినిమానే. అందులో డౌటే లేదు. బాలా పోలికలు కొన్ని ఉన్నా – చాలా వరకూ ఈ సినిమాని అవసరాల తన దైన స్టైల్ లోనే తీశాడు. ఈ సినిమాకి అవసరాల శ్రీనివాస్ హీరోనే కాదు. రచయిత కూడా. కాకపోతే… రచయితే ఈ సినిమాకి పెద్ద హీరో. ఎందుకంటే.. సినిమాలో చాలా సీన్లు.. తనలోని మాటల రచయితే పండించాడు. చిన్న చిన్న సీన్లే. కానీ సరదాగా ఉంటాయి. తమాషాగా సాగిపోతాయి. బట్టతలపై ఎన్ని జోకులు వేయొచ్చో, దాన్ని ఎన్నిరకాలుగా కామెడీ చేయొచ్చో అన్ని రకాలుగానూ చేసేశాడు. తన బట్టతల కవర్ చేసుకునే ఓ వ్యక్తి కథ ఇది. అందుకోసం తను పడే పాట్లన్నీ ఇందులో కనిపిస్తాయి.
బాత్రూమ్ లో పాటలు పాడుతూ స్నానం చేయడం, హీరోయిన్ కి తెలుగు రాదన్న ధైర్యంతో హీరో తెలుగులో పాటలు పాడుతూ – తన స్నేహితుడితో తన అభిప్రాయాల్ని కన్వే చేయడం, విగ్గు క్లిప్పులు మర్చిపోయి డిన్నర్‌కి వెళ్లడం… ఇలా ప్రతీ సన్నివేశంలోనూ కామెడీ ఉండేలా చూసుకున్నాడు. విగ్గు సంగతి దాచి పెట్టడానికి హీరో చేసిన ఫీట్లన్నీ నవ్విస్తాయి. ఫస్టాఫ్‌లో వంక పెట్టడానికి ఏం లేకుండా పోయింది. హీరోయిన్‌కి విగ్గు సంగతి ఎప్పుడైతే తెలిసిపోయిందో అప్పుడు కామెడీ చేయడానికి ఏం లేకుండా పోయింది.కానీ.. సందర్భంలోంచే ఆ కామెడీ పండించడానికి ప్రయత్నించారు. ఉదాహరణకు పెళ్లి సీను. అందులో హీరో కామెడీ చేయడానికి ఏం ప్రయత్నించడు. తన ఇబ్బందుల్లోంచే వినోదం పుట్టుకొస్తుంది. ఎలా చూసినా సరే, ద్వితీయార్థంలో కామెడీకి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఎమోషన్‌కి తప్ప. పతాక సన్నివేశాల్లో ఆత్మనూన్యతా భావం గురించి హీరో ఇచ్చిన స్పీచు.. కదిలిస్తుంది. ఆ తరవాత.. అందరూ ముందు నుంచీ ఊహిస్తూ వచ్చే సన్నివేశంతోనే రొటీన్ గా శుభం కార్డు వేసేశారు.
బట్టతలతో ఓ ఇలాంటి పాత్ర చేయడానికి చాలా ధైర్యం ఉండాలి. అవసరాల శ్రీనివాస్ కి హీరో ఇమేజ్ లేకపోవడం బాగా కలిసొచ్చింది. తను ఈ పాత్ర చేయడానికి అదే ధైర్యం ఇచ్చి ఉండొచ్చు. తన కామెడీ టైమింగ్ కి తిరుగు లేదు. పైగా రచయిత కూడా తనే కావడంతో తన బాడీ లాంగ్వేజికి తగ్గట్టే సీన్లు రాసుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగా చేశాడు. రుహానీది స్మైలింగ్ ఫేస్. తను కూడా నవ్వుతూనే కనిపించింది. ఆ పాత్రనీ బాగానే తీర్చిదిద్దాడు దర్శకుడు. వీరిద్దరి మధ్యనే ఎక్కువ సీన్లు పడ్డాయి. మిగిలినవాళ్లంతా తలో చేయీ వేశారంతే.
అవసరాల స్క్రిప్టుని చాలా శ్రద్ధగా రాసుకున్నట్టు కనిపిస్తుంది. ఒక సన్నివేశం తరవాత.. మరోటి పేర్చుకుంటూ వెళ్లాడు. చాలా తెలుగు మాటలు ఆకట్టుకుంటాయి. టైటిల్ సాంగ్ పెప్పీగా ఉంది. మిగిలిన పాటలేం గుర్తుండవు. నేపథ్య సంగీతం, ఫొటోగ్రఫీ రెండూ కూల్‌గానే ఉన్నాయి. ఇలాంటి కథతో రెండు గంటల పాటు కూర్చోబెట్టడం చాలా కష్టం. బట్టతల అన్నది చాలా చిన్న పాయింట్. దాని చుట్టూ కథ నడుపుతూ.. మెప్పించడం కత్తిమీద సామే. దాన్ని ఆడుతూ పాడుతూ చేసుకొచ్చేసింది టీమ్. సినిమా అంతా ఒకే ఫ్లోలో సాగుతుంది. తొలి సగం పర్వాలేదు .. రెండో సగంలో ఎమోషనల్ సీన్లుతో స్లోగా ఉంటుంది. మొత్తానికి `101 జిల్లాల అందగాడు` అంతగా ఆకట్టుకోలేక పోయింది !
ఫినిషింగ్ టచ్: ఫర్లేదు.. అందగాడే!
రేటింగ్: 2.25/5