ఆయుష్మాన్ ఖురానా నటించిన బాలీవుడ్ చిత్రం `బాల`. బట్టతల ఉన్న ఓ యువకుడి బాధలన్నీ వినోదాత్మకంగా చూపించిన సినిమా అది. దానికి రీమేకో, ఫ్రీమేకో క్లారిటీ లేదు గానీ, `101 జిల్లాల అందగాడు` కూడా సరిగ్గా అలాంటి కథే. బట్టతలని కవర్ చేస్తూ.. విగ్ పెట్టుకుని తిరిగే ఓ యువకుడి పాట్లూ, ఆటలూ… మొత్తం కలిసి ఈ సినిమా. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించాడు. రుహానీ శర్మ కథానాయిక. దిల్ రాజు, క్రిష్ ఇద్దరూ ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరించడం విశేషం. సెప్టెంబరు 3న విడుదల అవుతోంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు,.. అందించింది కూడా అవసరాల శ్రీనివాసే. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడు.
ట్రైలర్ మెత్తం ఫన్ రైడ్ గా సాగింది. చివర్లో ఎమోషన్స్ కూడా దట్టించినట్టు అర్థమవుతోంది. జుట్టు రాలిపోవడం, బట్టతల ఈ సమస్యతో కొన్ని కోట్లమంది బాధ పడుతున్నారు. వాళ్ల బాధకి వినోదం జోడించి చెప్పారిందులో. అవసరాల కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరహా పాత్రలో కనిపించడం ఓ సాహసమే మరి. ఫన్ వర్కవుట్ అయి, చివర్లో ఆ ఎమోషన్స్ పండితే – మరో సరదా సినిమాని చూసే భాగ్యం తెలుగు ప్రేక్షకులకు కలుగుతుంది.