హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చేనెల 2న ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు 5న వెలువడతాయి. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నిక మాత్రం ఫిబ్రవరి 11న జరగబోతోంది. హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు ఎక్స్ అఫిషియో సభ్యుల తుది జాబితాను రూపొందిస్తున్నారు. ఒకటి రెండు రోజులలో ఈ జాబితా ఖరారు కానుంది. ఎక్స్ అఫిషియో సభ్యుల సంఖ్య 50 నుంచి 60 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. 150 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు కలిసి మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 25 మంది ఎమ్మెల్యేలు, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నారు. వీరుకాక ఐదుగురు రాజ్యసభ ఎంపీలు, ఐదుగురు లోక్ సభ ఎంపీలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు 25 మంది దాకా ఎమ్మెల్సీలు కూడా హైదరాబాద్ నగర కార్పొరేషన్ పరిధిలో ఉంటామని కోరినట్లు సమాచారం. వీరందరితో కలిపి ఎక్స్ అఫిషియో సభ్యుల సంఖ్య 60 దాకా చేరేటట్లుంది. దీనితో మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నికలో పాల్గొనేవారి సంఖ్య 210మందికి చేరుతుంది. అంటే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు కావలసిన మేజిక్ ఫిగర్ 106గా మారింది. 2009లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికలో 65మంది ఎక్స్ అఫిషియో సభ్యులు పాల్గొన్నారు. అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో గ్రేటర్ పరిధిలో 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. విభజనతో ఈ సంఖ్య ఐదుకు తగ్గిపోయింది.