ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పరీక్షల విషయంలో వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. చివరికి పరీక్షలు రద్దు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎక్కడా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోయినా… అవసరం లేని పట్టుదలకు పోయిన ప్రభుత్వం .. చివరికి అన్ని మార్గాలూ మూసుకుపోయిన తర్వాత పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించుకోక తప్పలేదు. జూలై 31వ తేదీలోపు ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిందని.. పరీక్షల నిర్వహణ.. వాల్యూయేషన్ చేయడానికి నలభై ఐదు రోజులు పడుతుందని … ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు కాబట్టి… పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. మార్కులు ఏ పద్దతిలోఇవ్వాలో తర్వాత ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.
ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో… ఏపీ సర్కార్.. పరీక్షలు నిర్వహిస్తామనే తెలిపింది. శుక్రవారం దీనికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పింది. అయితే సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం..మరిన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయడం అసాధ్యమని.. ఆ లెక్కన పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని.. అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో..తన నియోజకవర్గం యర్రగొండపాలెంలో ఉన్న మంత్రి సురేష్‌ను ప్రభుత్వ పెద్దలు హుటాహుటిన విజయవాడకు పిలిపించారు. పరీక్షలు రద్దు చేస్తున్న నిర్ణయానికి సంబంధించిన ప్రకటనను చేతిలో పెట్టి చదవమని చెప్పి పంపించారు. మంత్రి సురేష్.. ప్రకటనను చదివి వినిపించారు. ఇంత కాలం పరీక్షలు విద్యార్థుల కోసమే నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు.. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా పరీక్షలు జరగనందున.. ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించినా సమస్య రాదని వాదించడం ప్రారంభించింది.
ఏపీ విద్యార్థులు చాలా రోజులుగా టెన్షన్లో ఉన్నారు. ఓ వైపు అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసి.. తదుపరి విద్యా సంవత్సరంపై దృష్టి పెట్టాయి. కానీ ఏపీ మాత్రం.. ఆగస్టు.. సెప్టెంబర్ అయినా పరీక్షలు పెడతామని చెబుతోంది. దీంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీపడుతూనే ఉన్నారు. గతంలో పరీక్షలు నిర్వహించాలనుకుని.. రెండు రోజుల ముందు వాయిదా వేస్తున్నట్లుగా చెప్పారు. నాలుగైదు నెలల పాటు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేసిన తర్వాత ప్రభుత్వం పరీక్షల రద్దు నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రద్దు చేయాలని విపక్షాలు … విద్యా రంగ నిపుణులు చాలా కాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. చివరికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.