తెలంగాణలో ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రిలీజ్ చేసినప్పుడు సగానికి సగం మంది తప్పారు. అప్పుడు తెలంగాణలో రేగిన గగ్గోలు అంతా ఇంతా కాదు. కనీసం ఇరవై మంది విద్యార్థుల వరకూ ఫెయిలయ్యామనే బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చాయి. ఇక్కడ మరీ యాభై శాతం కాదు కానీ.. 67 శాతం మంది మాత్రమే పాసయ్యారు. నిజానికి పదో తరగతి పరీక్షల్లో ఇది చాలా తక్కువ శాతం గత పదిహేను..ఇరవై ఏళ్లలో ఎప్పుడూ ఎనభై శాతానికి పాస్ పర్సటేజీ తగ్గిన సందర్భాలు లేవు. దీంతో ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు ఫెయిలయినట్లయింది.
దీంతో ఏపీలో గగ్గోలు ప్రారంభమయింది. వాల్యూయేషన్ మీద ఎలాంటి ఆరోపణలు లేకపోయినా.. అసలు విద్యా ప్రమాణాలను దిగజార్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. వేల కోట్లు ఖర్చు పెట్టి రంగులు వేయించి… కొన్ని స్కూళ్లకు నాణ్యతలేని పనులు చేయించి గొప్పగా చెప్పారు కానీ.. ఒక్క టీచర్ ను కూడా నియమించలేదని.. పైగా ఇంగ్లిష్ మీడియం పేరుతో విద్యార్థులందరి భవిష్యత్‌ను నాశనం చేశారన్న విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు ఈ అంశంపై సీరియస్‌గా స్పందిస్తున్నారు.
ఫెయిలయిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా .. కరోనా కారణంగా సరిగ్గా పరీక్షలు నిర్వహించలేదని.. చదువులు చెప్పలేదని.. ఈ సారి పాస్ చేయాలన్న డిమాడ్లు చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం మాత్రం కరోనా కారణంగా విద్యార్థుల చదువులు సరిగ్గాసాగలేదని.. సప్లిమెంటరీ నిర్వహిస్తామని.. ఫెయిలయిన వాళ్లందరికీ మళ్లీ ట్రైనింగ్ ఇచ్చి పరీక్షలు రాయిస్తామని హామీ ఇస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో ఇంటర్ పలితాల తరహాలో ఏపీలో టెన్త్ ఫలితాలు వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.