ఇరవై ఆరో తేదీన జరగాల్సిన రాజ్యసభ ఎన్నికల్ని .. ఈసీ వాయిదా వేసింది. కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండటం.. దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించడంతో ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదని నిర్ణయానికి వచ్చింది. 31వ తేదీన పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఈసీ తెలిపింది. ఈసీ రాజ్యసభ ఎన్నికలను నిర్వహిస్తే.. అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి.. కనీసం రెండు నెలల ఖర్చులకైనా ఓటాన్ అకౌంట్‌ను ఆమోదింప చేసుకోవాలని ఏపీ సర్కార్ అనుకుంది. ఇరవై ఆరో తేదీన రాజ్యసభ ఎన్నికల కోసం… ఎమ్మెల్యేలందరూ.. అమరావతి వస్తారు. వారందర్నీ మరో రెండురోజుల పాటు.. అక్కడే ఉంచి.. ఓటాన్ అకౌంట్ పెట్టాలనుకున్నారు. కానీ రాజ్యసభ ఎన్నికల్ని.. ఈసీ వాయిదా వేయడంతో.. ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినట్లయింది.
పార్లమెంట్ సమావేశాల్ని కూడా.. కరోనా కారణంగా వాయిదా వేశారు. దేశం మొత్తం దాదాపుగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే.. ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. అది ఒక్క ఎమ్మెల్యేల సమస్య కాదు.. అధికారయంత్రాంగం మొత్తం అసెంబ్లీ పనులపై ఉండాల్సి ఉంటుంది. దీని వల్ల కరోనా పై తీసుకుంటున్న చర్యలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ అయినా ఆమోదం పొందకపోతే.. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా సాధ్యం కాదు. ఒక్క రూపాయి బిల్లు కూడా విడుదల చేసుకోలేరు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తోంది. గతంలో ఓ సారి ఇలా ఆర్డినెన్స్ ద్వారా ఓటాన్ అకౌంట్‌ను ఆమోదింపచేసుకున్న అంశంపై పరిశీలన జరుపుతున్నారు. ఆర్డినెన్స్‌తో బడ్జెట్ గండాన్ని గట్టెక్కాలనుకుంటున్నారు.
అదే సమయంలో పదో తరగతి పరీక్షలు కూడా.. ప్రభుత్వానికి సమస్యగా మారాయి. హైకోర్టులో పిటిషన్ పడటంతో.. ఉన్న పళంగా పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించేసింది. అత్యవసర సర్వీసుగా భావించి.. పరీక్షలు నిర్వహిస్తామని.. మొన్న ప్రెస్మీట్లో జగన్ ప్రకటించారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎలా నిర్వహిస్తారని.. పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో.. రవాణా సౌకర్యాల్ని మొత్తం ఆపేశారు. లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదు. దీంతో వాయిదాకే మొగ్గుచూపారు. అసలు ఎప్పుడో.. టెన్త్ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఎన్నికల కోసం ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పుడు ఆ ఎన్నికలు జరగడం లేదు.. పరీక్షలు కూడా జరగడం లేదు.