బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక విషయంలో సీఎం రేవంత్ స్పీడ్ పెంచుతున్నారు. చేరికల విషయంలో వెనక్కి తగ్గొద్దని అధిష్టాన కూడా తేల్చి చెప్పడంతో రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ మరింత ఊపందుకోనుంది. బుధవారం ఏఐసీసీ పెద్దలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోయే ఎమ్మెల్యేల జాబితాను ఢిల్లీ పెద్దలకు అందించారు.
ఎమ్మెల్యేల చేరిక సమయంలో పార్టీ నేతల్లో ఎలాంటి అసంతృప్తి లేకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. గందరగోళానికి తావు లేకుండా చేరికలను డీల్ చేయాలని.. పార్టీకి సంస్థాగతంగా చేరికలు తప్పనిసరి అని ఏఐసీసీ నేతలు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో సీనియర్లకు ప్రాధాన్యతను తగ్గించవద్దని సూచించారు. రాష్ట్రంలో బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని..ఈమేరకు చేరికలను ప్రోత్సహించాలని ఢిల్లీ పెద్దలు చెప్పగా, అసెంబ్లీ సమావేశాల్లోపే పదకొండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని రేవంత్ స్పష్టం చెసినట్లు సమాచారం.
అయితే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని హైకమాండ్ కు రేవంత్ ఇచ్చిన జాబితాలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల కేసీఆర్ అత్యవసరంగా నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టిన ఐదుగురు ఎమ్మెల్యేలతోపాటు మరో ఆరుగురు ఎవరు అనేది గులాబీ శిబిరంలో కలవరం మొదలైంది. పార్టీలో చేరే ఎమ్మెల్యేల పేర్లు చివరి వరకు లీక్ కాకుండా రేవంత్ అడుగులు వేస్తుండటంతో..ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, బుజ్జగించడం గులాబీ బాస్ కు పెద్ద టాస్క్ లా మారింది.