హైదరాబాద్: ఒకటి రెండు రోజులలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుండటంతో టీఆర్ఎస్ ప్రభుత్వం జోరుగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తోంది. ఇవాళ ఉదయమే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఫోర్త్ ఫేజ్లో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన 630 ఇళ్ళ ప్రాజెక్టును ప్రారంభించి లబ్దిదారులకు ఆ ఇళ్ళను పంపిణీ చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహేందర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో రు.71 లక్షల వ్యయంతో నిర్మించిన జపనీస్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేబీఆర్ పార్క్ వద్ద నిర్మించనున్న మల్టీ లెవల్ ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేశారు. రు.886 కోట్ల వ్యయంతో మొత్తం 11 ఫ్లై ఓవర్లు నగరంలో రానున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారుల అభివృధ్ధికోసం 20 వేల కోట్లను కేటాయించామని కేటీఆర్ చెప్పారు. కేబీఆర్ పార్క్ చుట్టూనే 6 జంక్షన్లు వస్తాయని, వీటివలన ఎక్కడా సిగ్నల్ తగలకుండా ట్రాఫిక్ సాగిపోతుందని తెలిపారు. ఇలాంటి జంక్షన్లు నగరంలో మొత్తం 54 వస్తాయని చెప్పారు. ట్రాఫిక్ జామ్ అనేదే ఉండదని కేటీఆర్ అన్నారు.