దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ బిజెపిలను చిత్తుచేసి సంచలన విజయం సాధించిన పార్టీ ఆమ్ ఆద్మీ .అందులోనూ ప్రధానంగా విద్యాధికులు మధ్యతరగతి బుద్ధిజీవులతో అరవింద్ కేజ్రీవాల్ దాన్ని ఏర్పాటు చేశారు.! అయితే ఆయన రెండవ సారి ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటికి ఆ పార్టీకి చెందిన పన్నెండుమందిని ఏదో ఒక విధమైన ఆరోపణతో ఫిర్యాదుతో పోలీసులు, ఎసిబి, ఆదాయపన్ను శాఖ అధికారులు వెంటాడుతున్నారు. అరెస్టులు చేశారు. .
పార్టీ కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడనే ఆరోపణపై తాజాగా శరద్ చౌహాన్‌ను అరెస్టు చేశారు. ఇప్పుడు శరత్ తప్ప మిగిలిన వారంతా బెయిలుమీద బయిటకు వచ్చినా కేసులు మాత్రం కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పైన కూడా కేసులకు లోటు లేదు. అరెస్టయిన వారిలో గృహహింస ఆరోపణలను ఎదుర్కొంటున్న సోమనాథ్ భారతి విషయంలో మాత్రం కేజ్రీవాల్ గాని ఇతర పార్టీ ఇతర నాయకులు గాని ఎలాటి సానుభూమి ప్రకటనచేయలేదు.మిగిలిన వారి విషయంలో కక్ష సాధింపుతోనే నిర్బంధిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ఉదాహరణకు నరేష్ యాదవ్ అనే ఎంఎల్ఎను అరెస్టు చేసి ఆయన విడుదలవుతుందగానే అమానుల్లా ఖాన్‌ను నిర్బంధంలోకి తీసుకున్నారు. సురీందర్ సింగ్ అనే ఎంఎల్ఎపై ఎఫ్ఐఆర్ దాఖలుచేయడానికి ఎసిబి చీఫ్ స్వయంగా పోలీసు స్టేషన్‌కు రావడం వివాదాస్పదమైంది. జితేందర్ సింగ్ తోమార్‌ను నకిలీ డిగ్రీ కలిగివున్నాడనే ఆరోపణతో 45 రోజులు జైలులో పెట్టారు.
ఆప్ ఎంఎల్ఎల అపరిపక్వత ఇందుకు కారణమని మొదట భావించినా తర్వాత కేంద్రం కక్ష సాధింపుతోనే ఇలా వరుసగా వెంటాడుతున్నదని అందరూ అంటున్నారు. పార్టీ ఎంఎల్ఎలు ఏ సమయంలోనైనా అరెస్టులకు సిద్ధమై వుండాలని అయితే చట్టపరమైన ముందుజాగ్రత్తలు తీసుకోగలిగితే ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. తాము చేస్తున్న మంచిపనులను మెచ్చుకోవలసింది పోయి మోడీ ప్రభుత్వం కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్నదని పార్టీ ఢిల్లీ శాఖ నాయకుడు అశుతోష్ విమర్శించారు. ఆప్ పేరుకు ఢిల్లీలో ప్రభుత్వం చేస్తున్నా పోలీసులు ఎసిబి ఏవీ దాని అధీనంలో వుండవు. కేంద్రం చెప్పుచేతల్లో వుంటాయి. కనకనే బిజెపి నేతల మీద కేంద్ర మంత్రుల మీద కూడా ఎన్ని ఫిర్యాదులున్నా పట్టించుకోని పోలీసులు తమపై లేనిపోని ఆరోపణలు మోపి అరెస్టులు చేయడం ద్వారా అప్రతిష్ట కలిగించాలని భయపెట్టాలని చూస్తున్నారని ఆఫ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఆ అరెస్టుల పరంపర చూస్తుంటే ఆపైపైన పరోక్ష కక్ష సాధింపునకు బిజెపి అంటే కేంద్రం ప్రయత్నం చేస్తున్నదా అని సందేహించవలసి వస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనూ ఎన్ని ఆరోపణలున్నా ఇన్ని అరెస్టులు జరిగిన సందర్బమే లేదు. ఢిల్లీ పాలనా నిబంధనలు మార్చకపోతే రానురాను ఈ ఘర్షణ సంక్షోభంగా మారే అవకాశం కూడా వుంటుంది.