మామూలు రోజుల్లో పెరోల్ రావాలంటే… సాధారణ ఖైదీలకు సాధ్యమయ్యే పని కాదు. కిందా మీదా పడాలి.. బయట తెలిసిన వాళ్లో ..లాయర్లో అనేక ప్రయత్నాలు చేయాలి. అదీ కాకపోతే… అధికార పార్టీ నేతలకు దగ్గర వ్యక్తులయినా అయి ఉండాలి. కానీ ఇప్పుడు.. దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లల మగ్గిపోతున్న వారికి… ఆత్మబంధువుగా.. కరోనా వైరస్ మారింది. ఎప్పటికైనా బయటకు వెళ్తామో.. లేదో అనుకున్న వారిని అధికారులు బలవంతంగా పెరోల్ ఇచ్చి మరీ పంపేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ నేరాల కింద జైళ్లలో ఉన్న 12 వేల మంది ఖైదీలకు పెరోల్ ఇచ్చారు. ఇందులో తీహార్ జైలు ఖైదీలు కూడా ఉన్నారు. ముందు ముందు మరింత మంది ఖైదీల్ని విడుదల చేయబోతున్నారు.
దేశంలో ఉన్న జైళ్ల సామర్థ్యానికి..అందులో ఖైదీల్ని ఉంచే సంఖ్యకు చాలా తేడా ఉంటుంది. వంద మంది ఖైదీలు పట్టగలగే జైళ్లలో… రెండు వందల మందిని కుక్కేస్తూంటారు. దీనికి తీహార్ జైలు కూడా అతీతం కాదు. దేశంలోని అత్యంత పెద్ద జైలు కాంప్లెక్స్ అయిన తీహార్ జైలులో పది వేల మందిని ఖైదు చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అక్కడ పద్దెనిమిది వేల మందిని ఉంచారు. ఈ కారణంగా.. ఎవరికైనా వైరస్ వ్యాప్తి చెందితే..అది సులువుగా అందరికీ అంటుకుంటుందన్న ఉద్దేశంతో.. వీలైనంతగా.. జైలుపై భారం తగ్గించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా… తక్కువ నేర తీవ్ర ఉన్న వారికి పెరోల్ ఇస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ జైళ్లన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎక్కువ మంది ఖైదీలకు 45 రోజుల పెరోల్ ఇస్తున్నారు. కొంత మందికి ఎనిమిది వారాల పెరోల్ మంజూరు చేసి బయటకు పంపుతున్నారు. అయితే.. ఇలా విడుదలయ్యే వారంతా.. స్వస్థలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. జైలు అధికారులు ఎన్వోసీ ఇచ్చినప్పటికీ.. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో.. ఇబ్బంది పడుతున్నారు. కరోనా కారణంగా.. ఇప్పుడు దేశం మొత్తం స్తంభించిపోయింది. అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొంత మందికి మాత్రం.. సంతోషం కలిగిస్తోంది. అలాంటి వారిలో.. విడుదలవుతున్న ఖైదీలు ఉన్నారు.