బిహార్ అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో నేరగాళ్ల హవా పెరిగిపోయింది. `ద అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)’ అనే సంస్థ తయారుచేసిన నివేదిక ఈ విషయం బల్లగుద్దిమరీ చెప్పేసింది. బిహార్ లో మొదటివిడత పోలింగ్ అక్టోబర్ 12న జరగబోతోంది. మొత్తం 249 స్థానాలకుగాను ఈ తొలిదశలో 49 స్థానాలకు పోలింగ్ జరగబోతుండగా, 583మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి జాతకాలను తిరగేస్తే అందులో 170మది నేరగాళ్లే. వీరిలో కూడా 130 మంది అభ్యర్థులపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. అంటే, హత్యలు చేయడం, లేదా హత్యాయత్నం వంటి నాన్ బెయిలబుల్ కేసులన్నమాట.
తొలిదశలో పోలింగ్ జరిగే 49 స్థానాల్లోని 37చోట్ల ఈ మహానేరగాళ్లు బరిలో ఉంటూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. కరడుగట్టిన స్వభావం పైకి కనిపించకుండా వీరంతా బీహార్ రాష్ట్ర ప్రజలకోసం సేవచేస్తామనీ చెబ్తూ ఓటర్ల దగ్గర దండాలు పెడుతున్నారు. వీరిలో ఎవరు గెలిచినా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ విధులు నిర్వహిస్తామంటూ ప్రమాణస్వీకారం చేస్తారు. నేరగాళ్లు చట్టసభల్లోకి ప్రవేశించడంపై ప్రజాస్వామ్య ప్రియులు ఎంతోకాలంగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. అయినా చట్టసభలు నేరగాళ్లతో నిండిపోతూనేఉన్నాయి. ఇప్పుడు బిహార్ ఎన్నికలు కూడా అందుకు విరుద్ధంగా ఉండవని తొలిదశలోని ఈ అంకెలు చూస్తేనే అర్థమైపోతోంది.
అభ్యర్థులుగా బరిలో ఉన్న మహానేరగాళ్లలో 16మందిపై ఏకంగా హత్యానేరం మోపబడిఉంది. నేరం రుజువుకాలేదుకనుక వీరు ప్రస్తుతానికి నేరారోపణ ఎదుర్కుంటున్న వ్యక్తులే. రుజువుకానంతవరకూ దొంగలు కూడా దొరలే. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జెడీయు కి చెందిన ప్రదీప్ కుమార్ (వార్సాలీగంజ్ నియోజకవర్గం)పై హత్యచేశారన్న ఆరోపణపై నాలుగు కేసులు ఎదుర్కుంటున్నారు. అలాగే, మరో ఏడుగురు అభ్యర్థులమీద కూడా ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయి. ఇక, 37మంది అభ్యర్థులపై హత్యాయత్నం కేసులు నమోదుచేయబడ్డాయి. రాంస్వరూప్ యాదవ్ అనే స్వతంత్ర అభ్యర్థిపై ఐదు కేసులు మోపబడ్డాయి. బీఎస్పీ, బీజేపీ, జన్ అధికార్ పార్టీ (లోక్ తాంత్రిక్) పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరి చొప్పునా, జెడీయు కి చెందిన ముగ్గురిపైనా హత్యాయత్నం కేసులున్నాయి.
తొలిదశలో ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో 37చోట్ల బరిలో ఉన్న అభ్యర్థుల్లో ముగ్గురు, లేదా అంతకంటే ఎక్కువ మంది నేరగాళ్లే కావడం విశేషం. ఇలాంటి నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయనుకోవడం భ్రమే. ఇక కోట్లకు పడగలెత్తిన వారి సంఖ్య కూడా తక్కువేమీకాదు. మొత్తం అభ్యర్థుల్లో 25శాతంకంటే ఎక్కువ మంది కోటీశ్వరులే. రేపటి ఎన్నికల్లో ధనప్రవాహం ఏమేరకు ప్రవహించబోతున్నదనడానికి ఇదో సంకేతం.
మొత్తానికి బిహార్ ఎన్నికల తొలిదశ పోలింగ్ తోనే ఆక్కడి కుల, హత్యా, ధన రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో దేశప్రజలకు తెలియబోతున్నది. అది కూడా ఎంతో దూరంలో లేదు. మరికొద్దిరోజుల్లోనే….