ఆంధ్రప్రదేశ్ కరోనా కోరల్లో తీవ్రంగా చిక్కుకున్న రాష్ట్రాల్లో ఒకటిగా మారుతోంది. మెట్రో సిటీలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఏపీలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఉదయం వరకూ జరిపిన కరోనా అనుమానితుల టెస్టుల్లో కొత్తగా 21 పాజిటివ్ కేసులు తేలాయి. దీంతో మొత్తం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 132కి చేరింది. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా ఇరవై చొప్పున కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా లేదు. ఇంకా 493 మంది కరోనా అనుమానితుల శాంపిళ్లు.. ల్యాబుల్లో ఉన్నాయి.
వాటిలో ఎక్కువగా.. ఢిల్లీ మర్కజ్ ప్రార్థలకు వెళ్లిన వారివే కావడంతో… మరింత ఎక్కువగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశం మొత్తం మీద.. కరోనా వైరస్ కేసులు 2 వేలు చేరుకున్నాయి. కరోనా కారణం చనిపోయిన వారి సంఖ్య 50 దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఉన్న రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. దేశం మొత్తం మీద.. విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేసి.. హోం క్వారంటైన్లోనో ఐసోలేషన్లోనే పెట్టిన అధికారులకు.. ఢిల్లీలోని తబ్లిగీ జమాతే .. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని ట్రేస్ చేయడం కష్టంగా మారింది.
వారంతా రైళ్లలోనే ప్రయాణం చేయడం.. వారి అడ్రస్సులు స్పష్టంగా లేకపోవడంతో.. వారికి సంబంధించిన ఉన్న వివరాలతోనే ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో బయటపడుతున్న కరోనా కేసులన్నీ… మర్కజ్ ప్రార్థనలకు సంబంధించినవే ఉంటున్నాయి. ప్రతీ రాష్ట్రం నుంచి దాదాపుగా వెయ్యి మంది ఈ ప్రార్థనలకు వెళ్లారు. అందుకే.. రానున్న రోజుల్లో మరిన్ని పాజిటివ్ కేసులు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు.