చంద్రబాబు ఐదేళ్ల కాలంలో గ్రాఫిక్స్ తప్ప ఏమీ చేయలేదు..! అని వైసీపీ నేతలు పదే పదే ప్రచారం చేశారు. వారి సోషల్ మీడియా బలం.. బలగంతో.. అంతా నిజమేనని నమ్మేట్లు చేశారు. పరిస్థితి ఎలా ఉందంటే.. ఇప్పుడు అమరావతిలో నిర్మాణాలేమీ లేవు.. అన్నీ గ్రాఫిక్సే అన్నా.. ప్రజలు నమ్మేస్తున్నారు. అందుకే ఎక్కడ నుంచి పరిపాలన సాగిస్తున్నారో అదే భవనాల్లో కూర్చుని గ్రాఫిక్స్ తప్ప మరేం లేవని వాదించగలుగుతున్నారు. అలా చేసిన సర్కార్.. ఇప్పుడు.. గ్రాఫిక్స్ జోలికి వెళ్లకూడదు కదా..! కానీ వెళ్తోంది.. గ్రాఫిక్స్ చూపిస్తోంది. కడతారో తెలియదు కానీ.. కళ్లు చెదిరిపోయే గ్రాఫిక్స్‌ను కళ్ల ముందు ఉంచింది. స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వీటిని ప్రజల ముందు ఉంచారు.
మెడికల్ కాలేజీ భవనాల గ్రాఫిక్స్ అదుర్స్..!
పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ మెడికల్ కాలేజీ కట్టాలని సీఎం జగన్ సంకల్పించారు. పాలనకు రెండేళ్లు పూర్తయిన సందంర్భంగా మరో మూడేళ్లలో పూర్తవ్వాలన్న లక్ష్యంతో … పధ్నాలుగు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు చేశారు. ఎప్పట్లాగే క్యాంప్ కార్యాలయంలో ఆయన తన సీట్లో కూర్చుని మీట నొక్కారు. శంకుస్థాపన జరిగిపోయింది. అంత వరకూ బాగానే ఉంది కానీ.. అసలు ఆ మెడికల్ కాలేజీలు ఎలా ఉండబోతున్నాయో.. గ్రాఫిక్స్ రిలీజ్ చే్యడమే ఇక్కడ అసలు ట్విస్ట్. ఆయా నియోజవకవర్గాలు.. జిల్లాలకు చెందిన మంత్రులు.. విపరీతంగా ఆ గ్రాఫిక్స్‌ను షేర్ చేశారు. వైరల్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అది మరోలా వెళ్లింది.
అమరావతి విషయంలో చేసిన గ్రాఫిక్స్ విమర్శలు గుర్తుకు రాలేదా..?
గ్రాఫిక్స్ మొత్తం అబ్బురపరిచేలా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో రాజధానికి మాస్టర్ ప్లాన్ గ్రాఫిక్స్ ఎలా ఆకట్టుకున్నాయో… మెడికల్ కాలేజీల గ్రాఫిక్స్ కూడా అలాగే ఆకట్టుకున్నాయి. అంత వరకూ బాగానే ఉన్నా… వైసీపీ పాత స్ట్రాటజీ ప్రకారం.. మీరు కూడా గ్రాఫిక్స్ రిలీజ్ చేస్తున్నారేంటీ.. అనే చర్చ ప్రారంభమయింది. రెండేళ్ల కిందట… పులివెందుల బస్టాండ్ అంటూ.. ఓ గ్రాఫిక్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం… అద్భుతమైన బస్టాండ్ రెడీ కావాల్సి ఉంది. కానీ అక్కడ పునాది కూడా పడలేదు. అలాగే.. పులివెందుల, అరకు మెడికల్ కాలేజీలకు కూడా గతంలో పునాదులు వేశారు. అక్కడా పనులు జరగడం లేదు. ఆ రెండింటికి.. కేంద్రం నిధులు ఇస్తోంది. అయినా పనులు జోరందుకోలేదు. అందుకే ఇప్పుడు గ్రాఫిక్స్‌ను ట్రోల్ చేస్తున్నారు.
కట్టకపోతే ప్రజలు టీడీపీకి ఇచ్చిన ట్రీట్మెంటే ఇస్తారు..!
ఏపీ సర్కార్ .. గత రెండేళ్ల కాలంలో అభివృద్ధి పనులు అసలు చేపట్టలేదు. ఎక్కడా నిర్మాణ రంగమే ముందుకెళ్లలేదు. ఈ క్రమంలో వచ్చే మూడేళ్లలో అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేస్తారంటే ఎవరూ నమ్మడం లేదు. ఉద్దానంలో యాభై కోట్లతో కట్టాల్సిన ఆస్పత్రికి జీవో ఇచ్చి కూడా.. పట్టించుకోకపోవడంతో.. అన్నింటికీ అదే దారి పడుతుందని అంటున్నారు. మెడికల్ కాలేజీల పేరుతో రుణాలు తీసుకోవడానికి స్కెచ్ వేశారని… పాత మెడికల్ కాలేజీలను తాకట్టు పెట్టేందుకు ప్లాన్ అన్న విమర్శలు వస్తున్నాయి. కారణం ఏదైనా కానీ.. గత ప్రభుత్వంపై గ్రాఫిక్స్ అని చేసిన విమర్శలు ఇప్పుడు.. రివర్స్ అవుతున్నాయి. కట్టి చూపించకపోతే.. ఎంత సోషల్ మీడియా బలంతో ఎదురుదాడి చేసినా ప్రజలు… మరో రకంగా అనుకునే ప్రమాదం ఉంది.