అమెరికాలో మళ్ళీ నిన్న కాల్పులు జరిగాయి. అమెరికాలోని సాన్ బెర్నార్డినో నగరంలో ఇన్ ల్యాండ్ రీజియనల్ సెంటర్ లోకి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో ప్రవేశించి లోపల ఉన్న పౌరులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో మొత్తం 14మంది మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు. స్థానిక కాలమాన ప్రకారం నిన్న ఉదయం 10.59 గంటలకి ఈ సంఘటన జరిగింది. రీజియనల్ సెంటర్ లో కాల్పులు జరిగిన సమయంలో కొన్ని స్థానిక సంస్థలు ఏర్పాటు చేసిన ఒక విందు సమావేశం జరుగుతోంది. ముగ్గురు దుండగులు నేరుగా అక్కడికే వచ్చి వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఈ దారుణం జరిగింది.
దీని గురించి సమాచారం అందుకొన్నవెంటనే స్థానిక పోలీస్ స్వాట్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని ఆ ముగ్గురు వ్యక్తులను ఎదుర్కొన్నారు. వారిలో ఒకడు పోలీసు కాల్పులలో మరణించినట్లు తెలుస్తోంది. మరొకడు తప్పించుకొని పారిపోగా మూడో వ్యక్తి కోసం ఆచూకీ ఇంకా తెలియవలసి ఉంది. వారు ముగ్గురూ ఒక నల్ల రంగు వాహనంలో నేరుగా రీజియనల్ సెంటర్ లోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. కాల్పులు మొదలయిన సమయంలో ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న వాటర్ మ్యాన్ అవెన్యూలో స్వాట్ పోలీసులు శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాల్పుల సమాచారం అందగానే వారు తక్షణమే అక్కడకి చేరుకోగాలిగారు.
ఇది ఉగ్రవాదుల దాడా…లేక అమెరికాలో వ్యాపించిన గన్ కల్చర్ ప్రభావమా? అనేది ఇంకా తేలవలసి ఉందని లాస్ ఎంజలీస్ లో ఎఫ్.బి.ఐ. ఫీల్డ్ ఆఫీసర్ డేవిడ్ బౌడిచ్ అన్నారు. ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ కాల్పులకు తామే భాద్యులమని ప్రకటించుకోలేదు కనుక ఇది గన్ కల్చర్ ప్రభావమేనని భావించవలసి ఉంటుంది. స్వాట్ దళాలు ఆ భవనం రెండవ అంతస్తులో ఒక బాంబుని కనుగొని నిర్వీర్యం చేశారు. తప్పించుకొని పారిపోయిన మూడవ వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.