ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 144 సెక్షన్ పాలన నడుస్తోందని.. రాజకీయ పార్టీలు కొద్ది రోజులుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. దీనికి కారణం.. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే.. ఆయన ఇంటి దగ్గర 144సెక్షన్ ప్రకటించారు. అక్కడ ఇప్పటికీ తొలగించలేదు. ఆ తర్వాత ప్రతీ చోటా చివరికి.. బోటు ప్రమాదం జరిగినప్పుడు.. గోదావరి మధ్యలో ఉన్న గ్రామాల్లో కూడా 144 సెక్షన్ ప్రకటించారు. ఇక అమరావతి ఉద్యమం జరుగుతున్న ప్రాంతాల్లో పెట్టకుండా ఎలా ఉంటారు..? ఓ రకంగా.. గుంటూరు, కృష్ణా జిల్లాలు మాత్రమే కాదు.. అమరావతికి మద్దతుగా..ఎక్కడ ప్రదర్శన జరిగినా.. అక్కడ పోలీసులు 144 సెక్షన్ ప్రయోగిస్తున్నారు. తిరుపతిలో చంద్రబాబు పర్యటనకు అనుమతి నిరాకరించి పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలోనే… సుప్రీంకోర్టు 144 సెక్షన్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేసింది. పదే పదే 144 సెక్షన్ను ఉపయోగించడం అధికార దుర్వినియోగం అవుతుందని సుప్రీంకోర్టు విస్పష్టంగా పేర్కొంది. 144 సెక్షన్ విధించడం ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడమేనన్న సుప్రీం ధర్మాసనం.. ప్రజాస్వామ్య హక్కుల్ని హరించడానికి 144 సెక్షన్ను ఆయుధంగా ఉపయోగించుకోకూడదని పేర్కొంది. అభిప్రాయభేదాలు ఉన్నంత మాత్రాన 144 సెక్షన్ విధించడం సబబు కాదన్నారు. హింసకు దారితీసే అవకాశాలు ఉన్నాయని స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్ప 144 సెక్షన్ విధించకూడదన్నారు.
అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కశ్మీర్ అంశానికి సంబంధించినది. అక్కడ ప్రభుత్వం చాలా కాలంగా… ఇంటర్నెట్ ను నిలిపివేసి.. 144సెక్షన్ అమలు చేస్తూ.. చాలా మంది నేతల్ని నిర్బంధంలో పెట్టారు. దీనిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అయితే.. చట్టం దేశం మొత్తానికి ఒకటే కాబట్టి… కశ్మీర్ విషయంలో తీర్పు ఇచ్చినప్పటికీ.. ఏపీకి కూడా వర్తిస్తుందన్న చర్చ ప్రారంభమయింది. ఓ చోట 144 సెక్షన్ విధించాలనుకుంటే.. దానికి తగ్గ సాక్ష్యాలు ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడు ఏపీ పోలీసులకు అదే పెద్ది చిక్కు తెచ్చి పెట్టినట్లయింది. రాజకీయ సభలు, సమావేశాలు కూడా ఇతర పార్టీలు నిర్వహించకోకుండా.. ప్రజాస్వామ్య నిరసన తెలియజేయకుండా అడ్డుకునేలా వ్యవహరించడంలో ఏపీ సర్కార్.. రాటుదేలిపోయింది. ఇప్పుడీ తీర్పు ప్రామాణికంగా ఏపీ సర్కార్ పై కోర్టులో పిటిషన్లు పడినా ఆశ్చర్యపోనవసరం లేదన్న భావన వ్యక్తమవుతోంది.