14 వ ఫైనాన్స్ కమిషన్ లేదా ఆర్థిక సంఘం. మామూలుగా ఆర్థిక వేత్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు మాత్రమే పరిచితమైన ఈ పదం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్లో సామాన్య ప్రజలకూ రాజకీయ కార్యకర్తలకూ కూడా మామూలై పోయింది. రాజకీయ ఇరకాటంలో పడిన ప్రతి ప్రభుత్వానికి సమర్థించుకోవడానికి ఏదో ఒక సాకు కావాలి. ఇక్కడ ఆ భారం 14వ ఆర్థిక సంఘంపై పడింది.
14వ ఆర్థిక సంఘం పేరులోనే వున్నట్టు 13 సంఘాల తర్వాత అది వచ్చింది. ఇది రాజ్యాంగం 280 వ అధికరణం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావలసిన పన్నుల వాటాను నిర్ధారించే వ్యవస్థ మాత్రమే తప్ప రాష్ట్రాల విభజన వంటి ప్రత్యేకాంశాలతో సంబంధం వుండదు. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ వైవిరెడ్డి చైర్మన్గా 14 వ ఆర్థిక సంఘాన్ని 2013 జనవరి 13న నియమించారు. అప్పటికి ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఆంధ్ర ప్రదేశ్ విభజనకు సంబంధించిన నిర్ణయం ప్రకటించలేదు. దానికి ఇచ్చిన పరిశీలనాంశాలలో( టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్)లో ప్రత్యేక హౌదా అన్న అంశమే లేదు. 2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో తీవ్రమైన రభస మధ్య విభజన బిల్లు ఆమోదం పొందిన తరుణంలో ప్రధాని (మన్మోహన్ సింగ్) ప్రకటించిన ప్రత్యేక హౌదా గురించి అది పరిశీలించడం ఎలా సాధ్యం? 14 వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వాటాను32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది గనక ఆంధ్ర ప్రదేశ్ అవసరాలన్ని తీరిపోయినట్టు చబుతున్నారు గాని ఆ వాదన సరికాదు. 42 శాతం అనేది అన్ని రాష్ట్రాలకు వర్తించే మామూలు పెరుగుదల. ఆర్థిక సంఘాలు అంతకు ముందుకన్నా నిధుల పెరుగుదల సిపార్సు చేయడం మామూలుగా జరిగేదే. ఉదాహరణకు మొదటి ఫైనాన్స్ కమిషన్ కేవలం ఆదాయం పన్ను,ఎక్సయిజ్ సుంకాలనే పంపిణీ చేసింది. పదవ ఫైనాన్స్ కమిషన్ నాటికి అనేక ఇతర వనరుల పంపిణీ కూడా చేపట్టారు. అయినా రాష్ట్రాలకు రావలసిన దాంట్లో కొద్ది భాగమే ఇచ్చి కేంద్ర పెత్తనమే నడిపించారు.
14 వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు వచ్చేఆదాయం 45 శాతం పెరిగిందంటున్నారు గాని పెరిగింది పదిశాతమే. 32 శాతం వున్నప్పుడు ఈ మొత్తం 3.48 లక్షల కోట్లు కాగా 42 శాతంకింద 5.26 కోట్లుగా వుంటుంది. మొత్తంపైన ఇది 1.78 లక్షల కోట్ల పెరుగుదల. ఇదంతా సకాలంలో సక్రమంగా మంజూరు చేసి విడుదల చేసినప్పటి మాట.కాని మరోవైపున కేంద్రం నుంచి రావలసిన గ్రాంట్లు వంటివాటిని మొత్తంగా ఎత్తివేశారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు(సిఎస్ఎస్)ల వ్యయం రాష్ట్రాలు అధికంగా భరించాలని ఆర్థికసంఘం చెబితే కేంద్రం ఆ పథకాలనే ఎత్తివేస్తానన్నట్టు మాట్లాడుతున్నది. లెక్కలుఎప్పుడూ శాతాలలో చూడాలి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్కు కేంద్ర వనరులలో 6.937 శాతం లభించేది.ఇప్పుడు తెలంగాణకు 2.437 శాతం, ఎపికి 4.305 శాతం కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ రెండు కలిపిచూస్తే 6.472 శాతం అవుతుంది. ఇది గతంలో కన్నా పెరిగినట్టా? తగ్గినట్టా?
14వ సంఘం సిపార్సుల మేరకు ఎపికి 1,69,969 కోట్లు వస్తుంది. రెవెన్యూ లోటు కింద అయిదేళ్లలో 22,113 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. తుపానుల సహాయానికి గాను 90 శాతంకేంద్రమే భరించేవిధంగా 2492 కోట్లు సాయం, స్థానిక సంస్థల కోటాకింద మరో ప్రత్యేక సహాయం నిర్దేశించారు. ఇవన్నీ రావలసినవి ఈ లోగా 2014-15లో కేవలం 13,560 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి మంజూరైనాయి. ఒక్కఏడాది రెవెన్యూలోటు 18 వేల కోట్ల పైమాటేనని చెప్పిన కేంద్రం అయిదేళ్ల మీద కూడా పరిమితంగానే ఇవ్వాలనుకోవడం విభజన చట్టంలోని విషయాలకు కూడా భిన్నం.మరి చట్టంలో వున్నదానికన్నా ఎక్కువగా చేశామనే వారు వున్నవాటికే మీన మేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు? గొప్పగా నిధులిచ్చాం అని చెప్పగల పరిస్థితి లేక బాగానే ఇచ్చామని, అన్నీ ఒకసారి విడుదల చేయలేమని వెంకయ్య నాయుడే సన్నాయినొక్కులు నొక్కుతున్నారు కదా.. ప్రతిపక్షాలు అంటే పొరబాటా?ఇప్పటిదాకా ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్న చర్చ ఒక్కసారిగా హౌంశాఖకు సంబంధించిందని మంత్రి చెబుతున్నారు.. ఇక దానివైపు చూస్తూ కూచోమంటారా?
పిపిపి బాటలో ఎపి!
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసి వచ్చినా రాష్ట్రాల హక్కుల పట్ల కనీస గౌరవం లేని ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. తన రాజకీయ ప్రణాళికల ప్రకారం నడవాలి గనకే ప్రణాళికా సంఘాన్నిరద్దు చేసి నీటి అయోగ్ నియమించారు. కేటాయింపులలోనూ ప్రణాళిక ప్రణాళికేతర వ్యయాల తేడా ఎత్తివేసి క్రమానుగత విధానపరమైన అభివృద్ధికి అవకాశం లేకుండా చేశారు. ఇంతవరకూ ఆంధ్ర ప్రదేశ్ విషయమై (అమరావతికి తెచ్చిన మట్టినీరు మినహా) నోరుతెరిచి స్పష్టత ఇవ్వకుండా ఘోర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.మరోవంక తమ పార్టీ నేతలకు రాష్ట్రంలో రాజకీయాలు నడపడానికి పురికొల్పుతున్నారు అమిత్ షా.తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా లాంచనంగా అడగడం ఢిల్లీ ప్రదక్షిణలు చేయడం మినహా వీటికోసం పట్టుదలగా ప్రజలను ప్రతిపక్షాలకు కలుపుకొని సాధించాలనుకోవడం లేదు. పైగా గట్టిగా అడగడం విమర్శించడం నేరమైనట్టు కేంద్రానికి కోపం వస్తే బతకలేమన్నట్టు మాట్లాడుతున్నారు. జ్యోతిబాసు వంటివారితోకలసి రాష్ట్రాల హక్కుల కోసం పోరాడిన ఎన్టీఆర్ వారసత్వం ఇలా తయారైందా అని ఆశ్చర్యం కలుగుతుంది. 14వ ఆర్థిక సంఘం ఎక్కడా ప్రత్యేక హౌదా రద్దు చేయాలని చెప్పలేదు. ఇప్పుడు ఆ హౌదా కోల్పోతున్న 11 రాష్ట్రాలు ఒత్తిడి తేవడానికి వెనుకాడ్డం లేదు. కాని ప్రత్యేక హౌదా ప్యాకేజీ హుళక్కి అని తేలిపోతున్నా ప్రభుత్వం తీవ్రంగా తీసుకోకపోవడానికి రాజకీయ కారణాలు వున్నాయి. మౌలికంగా కార్పొరేట్ మార్గంలో పిపిపి నమూనాలో ముందుకుపోవాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు కేంద్రం పాత్ర వాటా తక్కువగా వుంటే ఏ చిక్కులు వుండవని భావిస్తున్నారు. .