ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పై చావుదెబ్బ పడటం ఖాయమని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తేల్చేశారు. తన వారాంతపు ఆర్టికల్ కొత్త పలుకులో కేసీఆర్ దుస్థితిని ఆయన మరింత ఎటకారం చేశారు. పార్టీని కాపాడుకునేందుకు ఆయన ప్రయత్నాలు చాలవన్నట్లుగా చెప్పుకొచ్చారు. గతంలో కేసీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు ఆయన పార్టీని ఉనికి లేకుండా చేస్తున్నాయని అంటున్నారు. గతంలో ఇతర పార్టీల ఉనికి దెబ్బతీసిన తరహాలోనే ఆయన పార్టీ కూడా కనుమరుగు అవుతుందని పరోక్షంగా జోస్యం చెబుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందే అంటే.. మరో రెండు వారాల్లో కనీసం పదిహేను మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. వీలో ఎక్కువ మంది గ్రేటర్ పరిధిలోని వారే ఉంటారు. ఒకరిద్దరు తప్ప అందరూ కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారని ఆర్కే చెబుతున్నారు. ఆయన మాటలు బెదిరింపులు కాదని.. ఇటీవలి కాలం వరకూ వరుసగా రేవంత్ తో మర్యాదపూర్వక భేటీ అవుతున్న ఘటనలు చూస్తే అర్థమవుతుందని కాంగ్రెస్ నేతలంటున్నారు.
ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ మనుగడపై మాట్లాడుతున్నారు. తన ప్రభుత్వం ఉండదంటూ వ్యాఖ్యలు చేస్తున్న వారిపై విరుచుకుపడుతున్నారు. లాంగ్వేజ్ లో ఘాటును పెంచుతున్నారు. దీనికి కారణం.. బీఆర్ఎస్ చీఫ్ లేదా కేటీఆర్ తెర వెనుక ఏదో చర్చలు జరపడమేనని.. ఈ కారణం చూపి ఎమ్మెల్యేలు అందర్నీ లాగేందుకు రేవంత్ రెడ్డి స్కెచ్ రెడీ చేశారన్నట్లుగా ఆర్కే చెబుతున్నారు. నిజానికి ఆర్కే కూడా అదే చేయాలన్న సలహాలను.. రేవంత్ రెడ్డికి తన ఆర్టికల్ ద్వారా పంపించారని ఆనుకోవచ్చు. ఎందుకంటే… కేసీఆర్ మొదట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 63 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అప్పట్లో ప్రభుత్వ సుస్థిరత పేరుతో ఎమ్మెల్యేలను లాక్కుంటే ప్రజలు స్వాగతించారు. ఇప్పుడు కాంగ్రెస్ కు 64 మందే ఉన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఏం చేసినా తప్పు లేదన్న సంకేతాలను ఆర్కే ఇచ్చారు.
చేసినదంతా చేజేతులా చేసుకుని ఇప్పుడు టీడీపీ స్ఫూర్తిగా మళ్లీ బలపడదామని కేసీఆర్ పార్టీ నేతలకు చేస్తున్న హితబోధపైనా ఆర్కే సెటైర్లు వేశారు. గతంలో ఇలాంటి విషయాల మీద ఆర్కే చాలా సార్లు .. కొత్తపలుకు ద్వారా కేసీఆర్‌కు సలహాలిచ్చారు. కానీ కేసీఆర్ తాను చేయాలనుకున్నదే చేశారు. ఇప్పుడు రేవంత్‌కు ఆర్కే పరోక్ష సలహాలు పంపుతున్నారు