అతడు.. రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్ సత్తా చెప్పిన చిత్రమ్. మహేష్ స్టైలీష్ నటనని చూపించిన సినిమా. మేకింగ్‌లో.. కొత్త పుంతలు తొక్కించిన సినిమా. ఇప్పటికీ.. ఆ సినిమా గురించి మహేష్, త్రివిక్రమ్ అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. టీవీల్లో ఎన్నిసార్లు వచ్చినా చూస్తూనే ఉంటారు. అందులోని డైలాగులన్నీ… సినీ అభిమానులకు కంఠతా వచ్చు. అందుకే… అదో క్లాసిక్ అయ్యింది. ఈ సినిమా విడుదలై నేటికి… 15 ఏళ్లు.
నిజానికి ఈ కథ మహేష్‌కోసం రాసుకున్నది కాదు. అంతకు ముందే.. ఈ సినిమా కథని పవన్ కల్యాణ్ కి వినిపించాడు త్రివిక్రమ్. కథ చెబుతునప్పుడు పవన్ నిద్రపోయాడట కూడా. అందుకే.. పవన్‌తో తీయాల్సిన `అతడు`… మహేష్ చేతికి వెళ్లింది.
అతడుని ఇప్పుడంటే క్లాసిక్ అనుకుంటున్నాం గానీ, విడుదలైనప్పుడు జనాలకు పెద్దగా ఎక్కలేదు. వసూళ్లు బాగాన్నా, బ్రేక్ ఈవెన్ రావడం కష్టమైంది. కానీ టీవీల్లోకి వచ్చాక మాత్రం.. చూసిన సినిమానే మళ్లీ చూడడం మొదలెట్టారు. `మా` టీవీలో ఎప్పుడొచ్చినా ఈ సినిమాకి రేటింగ్స్ అదిరిపోతుంటాయి. “అతడు సినిమా టీవీల్లో చూశాక.. క్లాసిక్ అన్నారు. థియేటర్లోనూ ఆ రేంజులో జనం చూస్తే బాగుండేది“ అని త్రివిక్రమ్ అప్పుడప్పుడూ బాధపడుతుంటారు. కాకపోతే.. ఓవర్సీస్లో త్రివిక్రమ్ సినిమాలకు మంచి పునాది వేసిన సినిమా ఇది. అప్పటి నుంచీ.. త్రివిక్రమ్ సినిమా అంటే… ఓవర్సీస్లో మంచి రేట్లు పలకడం ప్రారంభమైంది.
వారసుడొచ్చాడు సినిమా కథకీ.. అతడుకీ దగ్గర పోలికలు ఉంటాయి. మధుబాబు రాసిన షాడో లో కొన్ని సన్నివేశాల స్ఫూర్తితో.. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ రాసుకున్నాడు త్రివిక్రమ్. అందుకోసం త్రివిక్రమ్ మధుబాబుని కలిసి ఆయన అనుమతి కూడా తీసుకున్నారు.