ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. దాన్ని లంచంతో కొనొద్దు` అంటూ జాగృతం చేశాడు ఠాగూర్.
`తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం` అంటూ.. హెచ్చరించాడు ఠాగూర్.
అటు కమర్షియాలిటీనీ, ఇటు సందేశాన్ని చక్కగా మౌల్డ్ చేసిన సినిమా ఇది. కాబట్టే… చిరు కెరీర్లో అతి పెద్ద హిట్ గా నిలిచింది. ఈసినిమా విడుదలై ఈరోజుకి 17 ఏళ్లు.
తమిళంలో ఘన విజయం సాధించిన `రమణ`కి ఇది రీమేక్. మురుగదాస్ దర్శకుడు. ఈ సినిమాని తెలుగులో డబ్ చేద్దామనుకున్నారు. కానీ.. పాయింట్ నచ్చి, తెలుగులో పెద్ద హీరోతో రీమేక్ చేస్తే బాగుంటుందని నిర్మాత మధు భావించారు. ఆ కథ అటు తిరిగి, ఇటు తిరిగి చిరంజీవి దగ్గరకు చేరింది. నిజానికి చిరు ఇమేజ్ కీ `రమణ` కథకీ అస్సలు సంబంధం ఉండదు. చిరు సినిమా అంటే డాన్సులు, ఫైట్లు, కామెడీ ఇవన్నీ ఆశిస్తారు. అవేమీ `రమణ`లో కనిపించవు. కానీ… ఆ కథలో నిజాయతీ చావకుండా – చిరు ఇమేజ్ ని దాటి బయటకు రాకుండా పర్ఫెక్ట్ గా మలచుకున్నారు వినాయక్ – పరుచూరి బ్రదర్స్. ఓ మంచి కథ దొరికితే – దాన్ని హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా ఎలా మార్చుకోవాలో చెప్పిన సినిమా ఠాగూర్.
రమణతో పోలిస్తే ఠాగూర్ లో చాలా మార్పులు జరిగాయి. అతి పెద్ద మార్పు. .. ఈ సినిమాలో హీరో చనిపోవాలి. అతన్ని ఉరి తీస్తారు. కానీ చిరంజీవి చనిపోతే.. ఫ్యాన్స్ ఒప్పుకోరు. పైగా యాంటీ క్లైమాక్స్ సినిమాలు తెలుగులో ఆడవు. అందుకే ఆ పాత్రని చంపే సాహసం చేయలేదు. చిరు – శ్రియల మధ్య లవ్ ట్రాక్, కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి లాంటి పాటలు, ఫ్లాష్ బ్యాక్‌లో చిరు పెళ్లి చూపుల సీన్ ఇవన్నీ తెలుగులో మాత్రమే కనిపించే కమర్షియల్ అంశాలు. `నేనుసైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను` లాంటి భావోద్వేగభరితమైన పాటలు, సన్నివేశాలు రమణ కంటే ఠాగూర్ ని మిన్నగా మార్చాయి. ఇక ఆసుపత్రి సీన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాని మరో స్థానంలో నిలబెట్టాయి.
ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్టే. కొడితే కొట్టాలిరా – చిరు ఇమేజ్‌కి తగిన పాట. ఈ పాటలో `రక్తం పంచిన తమ్ముళ్లే మీరు.. ` అనే మాట.. ఫ్యాన్స్‌కి పూనకం తెప్పించింది. మన్మథా మన్మథా మామ పుత్రుడాలో.. చిరు వీణ స్టెప్పుని కొనసాగించాడు. ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో వినాయక్ కనిపిస్తారు. తనలో ఇంత సీరియస్, సిన్సియర్ యాక్టర్ ఉన్నాడా అనిపిస్తుంది. చిరు గత రికార్డులనే కాదు, అప్పటి వరకూ తెలుగు నాట వచ్చిన రికార్డులన్నీ చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించింది ఠాగూర్. ఇప్పటికీ సందేశానికి, కమర్షియల్ టచ్ ఇవ్వడం ఎలాగో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.