లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు తెలంగాణ సర్కార్ ఈ నెల కూడా.. రూ. పదిహేను వందలు ఇవ్వాలని నిర్ణయించింది. మేడే రోజు సెలవు కాబట్టి… మే 2వ తేదీ నుంచి డబ్బులు జమ చేయనుంది. గత నెల పన్నెండు కేజీల రేషన్ బియ్యంతోపాటు రూ. 1500 ఇచ్చింది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తూండటంతో.. పేదలకు గత నెల కూడా ఉపాధి దొరకలేదు. దాంతో ఈ నెల రేషన్తో పాటు… కేజీ పప్పు… రూ. 1500 కూడా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం మహిళల జన్ ధన్ ఖాతాల్లో ప్రతీ నెల రూ. 500చొప్పున నాలుగు నెలలు వేయాలని నిర్ణయించింది. తెలంగాణ సర్కార్ ఇచ్చే మొత్తం.. దానికి అదనం.
ఇతర రాష్ట్రాలు కూడా పేదలకు ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఏపీ సర్కార్ గత మూడు విడతలుగా.. పదిహేను కేజీల రేషన్ బియ్యంతో పాటు.. ఇంటికెళ్లి మరీ రేషన్ కార్డు ఉన్న వారికి రూ. వెయ్యి ఇచ్చింది. ఈ నెలలో ఆర్థిక సాయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణ సర్కార్ ఇస్తోంది కాబట్టి.. ఏపీ సర్కార్ కూడా ఇచ్చే అవకాశం ఉందంన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పేదలు.. కూలీలు.. చిరు వ్యాపారులకు ఆదాయం ఆగిపోయి నెలన్నర రోజులు అవుతోంది. వివిధ రకాల ఖర్చులకు వారి వద్ద డబ్బులు లేని పరిస్థితి. దీంతో ఏపీ సర్కార్ ఖచ్చితంగా ఆదుకుంటుందని భావిస్తున్నారు.
కేరళ లాంటి రాష్ట్రాల్లో మూడు నెలలకు సరిపడే విధంగా పెన్షన్లు… ఇతర ఆర్థిక సాయాన్ని ఓ ప్యాకేజీ రూపంలో ముందుగానే ప్రకటించారు. దాని ప్రకారం.. జూన్ వరకూ అక్కడి పేదలకు సాయం అందుతుంది. యూపీ ప్రభుత్వం నిరుపేదల కుటుంబాలకు నెలకు రూ. వెయ్యి అందిస్తోంది. ఒడిషా సర్కార్.. సామాజిక పెన్షన్లు.. మూడు నెలల మొత్తాన్ని ఒకే సారి పంపిణీ చేసింది. ఆదాయాలు లేకపోయినా ప్రభుత్వాలు.. పేదలకు వీలైనంత సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.