ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో అభివృద్ధి పనుల కోసం పెట్టిన ఖర్చు.. బడ్జెట్లో ఒక్క శాతం కూడా లేదు. పోలవరం సహా.. అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు.. గత ప్రభుత్వంలో ప్రారంభమయ్యాయి. ఫుల్ స్వింగ్‌లో ఉన్న కనీసం రూ. లక్ష కోట్ల రూపాయల పనులను.. ఈ ప్రభుత్వం నిలిపివేసింది. ఖర్చునూ ఆపేసింది. కానీ.. ఎనిమిది నెలల తరవాత..రూ. వేల కోట్ల ఖర్చుకు పాలనా అనుమతుల మంజూరులో మాత్రం హడావుడి చేస్తోంది. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు చేపడతామంటూ… నిన్న ఒక్క రోజే… రూ. 12,308 కోట్లకు జీవోలు విడుదల చేసింది. 6 జిల్లాల్లో వాటర్‌గ్రిడ్ పనులు చేపట్టాలని.. ఈ జీవోల్లో పేర్కొన్నారు. తూ.గో జిల్లాకు 3,800, పగో జిల్లాకు 3,670 కోట్లు, శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో తాగునీటికి రూ.700 కోట్లు, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి రూ. 2,665 కోట్లు, ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి రూ. 833 కోట్లకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు.
పులివెందుల ప్రాంతంలో తాగునీటి సరఫరాకు రూ. 480 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఆస్పత్రుల అభివృద్ధికి రూ. 436.96 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నవరత్నాల అమల్లో భాగంగా ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు ఈ నిధులు విడుదల చేస్తున్నామంటూ ప్రకటించారు. ఏ ప్రభుత్వమైనా.. ప్రతిపాదనలు సిద్ధమైన తర్వాత.. ఖర్చును అంచనా వేసుకుని.. దానికి తగ్గట్లుగా.. నిధుల లభ్యతను చూసుకుని.. జీవోలు విడుదల చేస్తుంది. కానీ ప్రస్తుత ఏపీ సర్కార్.. ఏదో ముంచుకొస్తున్నట్లుగా వేల కోట్లకు పాలనా పరమైన అనుమతలు ఇస్తూ…పోతోంది. కానీ ఖర్చు మాత్రం కనిపించడం లేదు.
అడిగిన వారికి అడిగినట్లుగా.. అన్ని ప్రాంతాలకు రూ. వేల కోట్లు.. కేటాయిస్తూ.. జీవోలివ్వడం.. ప్రభుత్వ అధికారులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. వృద్ధి రేటు మందగించడంతో.. అప్పుల లభ్యత కూడా తగ్గిపోయింది. పెట్టుబడిదారులు రావడం లేదు. ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వంటి సంస్థలు… రుణాలివ్వడానికి నాలుగైదు సార్లు ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించకుండా… ఉత్త జీవోలు ప్రభుత్వం ఎందుకు విడుదల చేస్తుందో.. ఎవరికీ అర్థం కావడం లేదు. రేపు.. తాము అన్నీ చేద్దామనుకున్నామని.. కానీ చేయనివ్వలేదని.. చెప్పడానికి ఈ జీవోలు పనికొస్తాయన్న అంచనాతో.. అధికార పార్టీ ఉందన్న విశ్లేషణలు ఇతర పార్టీల వైపు నుంచి వస్తున్నాయి.