రాష్ట్ర విభజన తరువాత భద్రాచలం తెలంగాణాకి , తిరుపతి ఆంధ్రాకి దక్కడంతో రెండు రాష్ట్రాలు అత్యవసరంగా వాటికి ప్రత్యామ్నాయ ఆలయాలను అభివృద్ధి చేసుకొంటున్నాయి. తెలంగాణా ప్రభుత్వం తిరుపతికి ప్రత్యామ్నాయంగా యదాద్రి (యాదగిరి గుట్ట)ని అభివృద్ధి చేసుకొంటుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట రామాలయాన్ని భద్రాచలానికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేస్తోంది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించి యదాద్రి అభివృద్ధి పనులు వేగవంతం చేసారు. హైదరాబాద్ మెట్రో రైలును అక్కడి వరకు పొడిగించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్రం ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆ బాధ్యతను స్వీకరించి అప్పుడే రూ. 20 కోట్లు విడుదల చేసింది. టిటిడి జె.ఈ.ఓ. భాస్కర్, రాజంపేట ఎమ్మెల్యే ఎం.మల్లికార్జున రెడ్డితో కలిసి నిన్న ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని దర్శించుకొన్న తరువాత ఆలయ అభివృద్ధి పనులను సమీక్షించారు. మరో వంద కోట్లతో ఆలయం, దాని పరిసరాలు, రహదారులు వగైరా అన్నీ అభివృద్ధి చేయబోతున్నట్లు వారు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు.