దేశంలోకెల్లా అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. దాని తీర్పుకు ఇక తిరుగు ఉండదు. కానీ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో అది కూడా తప్పు చేసింది. దానిని నిజాయితీగా ఒప్పుకొని సరిదిద్దుకొంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర గవర్నర్ జ్యోతీ ప్రసాద్ రాజ్ ఖోవా నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలన విదించబడటం, దానిని కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో సవాలు చేయడం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ న్ని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు కేంద్రప్రభుత్వానికి, గవర్నర్ రాజ్ ఖోవాకి దీనిపై సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ గవర్నర్ కేంద్రానికి పంపిన నివేదికను కోర్టుకి సమర్పించాలని ఆదేశించింది.
దానిపై కేంద్రప్రభుత్వం తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ, రాజ్యాంగంలోని 361వ అధికరణం క్రింద గవర్నరుకి రాజ్యాంగ పరమయిన ప్రత్యేక రక్షణ ఉంటుందని, కనుక సుప్రీం కోర్టు కూడా గవర్నర్లపై ఏవిధమయిన ఆదేశాలు చేయలేదని వాదించారు. ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్.ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ దీపక్ మిశ్ర, జస్టిస్ పి.సి.ఘోష్, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఎం.బి.లోకుర్ లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గవర్నరుకి నోటీస్ ఇవ్వడం పొరపాటే అని అంగీకరించి, దానిని వాపసు తీసుకొంతున్నట్లు ప్రకటించింది. కానీ గవర్నర్ కి అభ్యంతరం లేకపోతే, ఈ వ్యవహారంలో తన నివేదికను, అభిప్రాయాలను సుప్రీం కోర్టుకి తెలియజేయవచ్చునని ధర్మాసనం తెలియజేసింది. రాష్ట్రపతి పాలన విధించిన తరువాత సచివాలయం, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాల నుండి జప్తు చేయబడిన కొన్ని ఫైళ్ళను, లేఖలను మాజీ ముఖ్యమంత్రి నబం తుకికి, సదరు మంత్రులకు, పార్లమెంటరీ కార్యదర్శులకు వాపసు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది.