ఇప్పుడు దేశంలో మారు మూల గ్రామాలలో కూడా లక్షలు పెడితే గానీ వంద గజాల స్థలం లభించడం లేదు. కానీ ముంబై నడిబొడ్డున రూ. 70 వేలకే ఏకంగా 2,000 చ.మీ.ల భూమి దొరుకుతోంది. నమ్మలేకపోతున్నారా? అయితే ఒకనాటి బాలీవుడ్ ప్రముఖనటి హేమమాలినీని అడగండి..ఆమే చెపుతారు ఏవిధంగా దొరుకుతుందో!
మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై నడిబొడ్డున గల అంధేరీ అనే ప్రాంతంలో2,000 చ.మీ.ల స్థలాన్ని కేవలం రూ. 70,000కే ఆమెకు కట్టబెడుతూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఆమె డాన్స్ స్కూల్ పెట్టబోతున్నారు. ముంబైలోని ఒక సామాజిక కార్యకర్త సమాచార హక్కును ఉపయోగించుకొని దీని గురించి వివరాలు కోరినపుడు ఈ సంగతి బయటపడింది. అంతవరకు అది మహారాష్ట్ర ప్రభుత్వానికి, హేమమాలినీకి మాత్రమే ఈ విషయం గురించి తెలుసు.
హేమమాలిని వంటి ప్రముఖ వ్యక్తికి కోట్లు పలికే స్థలాన్ని అంత కారుచవకగా కట్టబెట్టడంపై ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆమెపై, ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేసాయి. దానిపై ఆమె స్పందిస్తూ, “నేనేమి ప్రభుత్వ భూమిని కబ్జా చేయలేదు. దీనికోసం దరఖాస్తు చేసుకొని గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వంతో పోరాడుతున్నాను. దానికి ప్రభుత్వం ఎంత ధర నిర్ణయించిందో కూడా ఇంకా నాకు తెలియదు. నా డాన్స్ స్కూలుకి 2,000 చ.మీ.ల స్థలాన్ని కేటాయించినట్లు మాత్రం తెలుసు. దాని చుట్టూ ఉన్న మరో 27,000 చ.మీటర్ల ప్రభుత్వ స్థలంలో నేను నా స్వంత ఖర్చుతో పార్క్ ని అభివృద్ధి చేసి ప్రభుత్వానికి అప్పజెప్పాలని మాత్రం చెప్పారు. అంతవరకే తెలుసు. ఇంతవరకు నేను ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రభుత్వం దానికి ధర నిర్ణయించి చెపితే చెల్లించడానికి సిద్దంగా ఉన్నాను. నేనేమి అన్యాయంగా ప్రభుత్వం భూమిని కబ్జా చేసేసుకోవాలనుకోవడం లేదు. ఇక్కడ డాన్స్ స్కూల్ పెట్టాలనుకోవడం నేరమేమీ కాదు కదా? దీనిపై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో చాలా రాజకీయాలు చేసారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నాపై చాలా దుష్ప్రచారం జరిగింది. ఇంకా దీనిని ఇంతటితో వదిలిపెడితే బాగుంటుంది,” అని హేమమాలిని అన్నారు.
ఆ స్థలం తనకు కేటాయించబడినట్లు, దాని చుట్టూ ఉన్న27,000 చ.మీటర్ల ప్రభుత్వ స్థలంలో తన స్వంత ఖర్చుతో పార్క్ ని అభివృద్ధి చేసి ప్రభుత్వానికి అప్పజెప్పాలనే షరతు గురించి తనకు తెలుసు కానీ తనకు కేటాయించబడిన స్థలం ధర తెలియదని హేమమాలిని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అనేక దశాబ్దాలపాటు సినీ రంగాన్ని ఏలిన ఆమె ముంబై నడిబొడ్డున డాన్స్ స్కూల్ పెట్టాలనుకొంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ తనకున్న పలుకుబడితో ప్రభుత్వ భూమిని అంత కారుచవకగా స్వంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే అందరూ తప్పకుండా అభ్యంతరాలు చెపుతారు. తప్పుపడతారు కూడా. అయినా కోటీశ్వరురాలయిన ఆమె వంటి వారు కూడా ఇటువంటి చవకబారు ఆలోచనలు చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. నిరుపేదలకు 50 గజాల భూమి ఇవ్వడానికి సవాలక్ష అర్హతలు, షరతులు విధించే మన ప్రభుత్వాలు, ప్రముఖుల పట్ల మాత్రం ఈవిధంగా చాలా ఉదారంగా వ్యావహరిస్తూ కోట్లు రూపాయలు ఖరీదు చేసే భూమిని కారు చవకగా కట్టబెట్టేస్తుంటాయి. దానిని ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా తప్పుడు పడితే వారికి రోషం వస్తుంది.