ఈరోజు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాపు సంక్షేమ కార్పోరేషన్ కి రూ.1,000 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నారు. తెదేపా ఎన్నికల మ్యానిఫెస్టోలో కాపుల సంక్షేమానికి ఏడాదికి రూ. 1,000 కోట్లు చొప్పున ఐదేళ్ళలో ఐదువేల కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. కానీ ఆ హామీని ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయకపోవడంతో ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తునిలో మొన్న ఆదివారంనాడు కాపు ఐక్య గర్జన సభ జరగడం, తదనంతర పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. దానితో తీవ్ర ఒత్తిడికి గురయిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఈ విధంగా చేయడం ద్వారా తన హామీని నిలబెట్టుకొన్నట్లు గాక కాపు గర్జనకు భయపడి నిర్ణయం తీసుకొన్నట్లు సంకేతం పంపినట్లవుతుంది. ఇది చూసి మిగిలిన కులాలు, వర్గాల వారు కూడా గర్జిస్తే ప్రభుత్వం వారందరి ముందు మోకరిల్లవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఇప్పటికిప్పుడు కాపులకు రిజర్వేషన్లు ప్రకటించడం సాధ్యం కాదు కనుక వారిని శాంతింపజేసేందుకే ఒకేసారి ఇంత బారీ మొత్తాని కేటాయించినట్లు భావించవలసి ఉంటుంది.
ఉద్యమబాట పట్టిన కాపు నేతలతో చర్చలు జరిపేందుకుగాను ఇద్దరు ఉపముఖ్యమంత్రులు, ఆరుగురు మంత్రులతో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసారు. వారే ప్రభుత్వం తరపున కాపు నేతలతో చర్చలు జరుపుతారు. జస్టిస్ మంజూనాద్ కమీషన్ నివేదిక ఇచ్చేంత వరకు గడువు తీసుకోనేందుకే కేబినేట్ సబ్ కమిటీని నియమించి ఉండవచ్చును. ప్రభుత్వం ఈ చర్యలు ముందే చేపట్టి ఉండి ఉంటే, సమస్య ఇంత తీవ్ర రూపం దాల్చేది కాదు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం మొదలుపెట్టిన ముద్రగడ పద్మనాభం ఇంకా దీనిపై స్పందించవలసి ఉంది.