గ్రేటర్ ఎన్నికలలో తెరాస పార్టీ తిరుగులేని విజయం సాధించి మళ్ళీ తన సత్తా చాటుకొంది. అయితే ఈ ఎన్నికలను తెరాస గెలుపుగా కంటే ప్రతిపక్షాల ఓటమిగానే ఎక్కువగా చూడవలసి ఉంటుంది. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో ఎంతో బలం ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెదేపా, బీజేపీలు చాలా ఘోరంగా ఓడిపోయాయి. ఒకవిధంగా చెప్పాలంటే తెరాస అధినేత కేసీఆర్ వ్యూహాలకి అవి చిత్తు చిత్తుగా ఓడిపోయాయని చెప్పక తప్పదు
ఇంకా మరొక ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే, కె.టి.ఆర్.ని తన రాజకీయ వారసుడిగా చేయాలనుకొంటున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ ఎన్నికలను చాలా చక్కగా ఉపయోగించుకొంటూ కొడుకు కోసం చాలా చక్కటి వ్యూహం అమలు చేసారని చెప్పవచ్చును.
జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెరాస అసలు ఎన్నడూ గెలిచే అవకాశమే లేదని దాదాపు అందరూ నిర్ధారించేసినపుడు, ఆయన ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా సుమారు ఏడాదికి పైగా సకల ఏర్పాట్లు చేసి, ఈ ఎన్నికలలో ఖచ్చితంగా గెలుస్తామనే పూర్తి నమ్మకం ఏర్పడిన తరువాతనే తను పక్కకు తప్పుకొని తన కొడుకు కె.టి.ఆర్.కి ఈ ఎన్నికల బాధ్యతని పూర్తిగా అప్పగించేరు. అంటే బంగారు పళ్ళెంలో విజయాన్ని పెట్టి కొడుకుకి అందించినట్లు చెప్పవచ్చును. దానిని కె.టి.ఆర్. కూడా చాలా చక్కగా అందిపుచ్చుకొని, మరి కొంత కృషి చేసి ఊహించిన దానికంటే పార్టీకి ఘన విజయం దక్కేలా చేయగలిగారు. ఇది చాలా చక్కటి దీర్ఘకాలిక వ్యూహమని చెప్పవచ్చును.
ఈ విజయంతో కేసీఆర్ ఒకే దెబ్బకి మూడు పిట్టలు కొట్టినట్లయింది. 1. గ్రేటర్ పీఠం దక్కించుకొని ప్రతిపక్షాల విమర్శలకు గట్టిగా జవాబు చెప్పడం. 2. తన కొడుకు కె.టి.ఆర్.ని పార్టీలో తిరుగులేని నేతగా ప్రతిష్టించడం.3. గ్రేటర్ పరిధిలో ఆంధ్రా ప్రజలు సైతం ఇప్పుడు తెరాసని ఆదరిస్తున్నారని రుజువు చేయడం.
ఈ తిరుగులేని విజయంతో తెలంగాణాలో ప్రజలు అందరూ తెరాస చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆమోదిస్తున్నట్లు కూడా రుజువయింది.
అయితే ఈ విజయం కోసం కేసీఆర్ చేసిన కృషి అంతా సవ్యమయినదేనని చెప్పడానికి కూడా లేదు. “యుద్ధంలో గెలవడం ముఖ్యం కానీ ఎలాగ గెలిచామన్నది ముఖ్యం కాదనే విధానం” కేసీఆర్ ది. అందుకే గత ఏడాదిగా గ్రేటర్ పరిధిలో అనేక డివిజన్లను తెరాసకు అనుకూలంగా పునర్విభజన చేయడం, జాబితా సవరణ పేరిట అనేకమంది ఆంధ్రా ఓటర్ల పేర్ల తొలగింపు, ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలను కార్యకర్తలను ‘ఆపరేషన్ ఆకర్ష’ ద్వారా పార్టీలోకి ఆకర్షించి వాటిని బలహీనపరిచి, మానసికంగా దెబ్బ తీయడం, ఎన్నికలకు చాలా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసేసుకొని ప్రతిపక్షాలకు ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను కుదించడం వంటివి అనేక వికృత ఆలోచనలు, వ్యూహాలు కనబడుతున్నాయి.
ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, చివరికి ఆ పార్టీల అభ్యర్ధులను కూడా నయాన్నో భయాన్నో లొంగదీసుకొని తెరాసలోకి ఆకర్షించుతుండటం వలన, ఇక ఏ పార్టీకి ఓటేసిన చివరికి అందరూ తెరాసలోనే జేరుతారనే అభిప్రాయం ప్రజలకి కలిగేలా చేయగలగడం కూడా తెరాస విజయానికి గల కారణాలలో ఒకటని చెప్పుకోవచ్చును. ఈ బారీ విజయం తరువాత ప్రతిపక్షాల నుండి తెరాసలోకి బారీగా వలసలు మొదలవవచ్చును. అది తెరాస మరింత బలపడటానికి, ప్రతిపక్షాలు నిర్వీర్యం అవడానికి దోహదపడవచ్చును.