గ్రేటర్ ఎన్నికలలో తెదేపా-బీజేపీ కూటమి ఓడిపోగానే, తెదేపాతో స్నేహం కారణంగానే బీజేపీ కూడా మునిగిందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు అభిప్రాయపడినట్లు, కనుక ఇకనయినా తెదేపా నుండి తమకు విముక్తి కల్పించాలని వారు త్వరలో తమ పార్టీ అధిష్టానాన్ని కోరబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. ఆ వార్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెంటనే నిన్న ఖండించారు.
“తెదేపాతో పొత్తు వలన ఈ ఎన్నికలలో ఓడిపోయామని మేము భావించడం లేదు. అందుకు వేరే కారణాలు చాలా ఉన్నాయి. కనుక అందుకు తెదేపాను నిందించడం సరికాదు,” అని అన్నారు.
సాధారణంగా ఇటువంటి ఘోర పరాజయాల తరువాత అంతవరకు మిత్రపక్షాలుగా మెలిగిన పార్టీలు ఒకదానినొకటి నిందించుకోవడం సహజమే. మొదటి నుంచి తెదేపాతో పొత్తులు వ్యతిరేకిస్తున్న తెలంగాణా బీజేపీ నేతలు ఈ ఘోర పరాజయానికి తమ అధిష్టానానికి సంజాయిషీ చెప్పుకోవలసి ఉంటుంది కనుక అందుకు బలమయిన కారణం ఏదో ఒకటి కనుగొనవలసి ఉంటుంది. బహుశః అందుకే వారు ఈ అపజయాన్ని తెదేపా ఖాతాలో వ్రాసే ప్రయత్నం చేస్తే అందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఈ పరిస్థితులలో మీడియా వార్తలపై కిషన్ రెడ్డి వెంటనే స్పందించి తెదేపాను వెనకేసుకు రావడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.
సాధారణ పరిస్థితులలో అయితే కిషన్ రెడ్డి ఇటువంటి వార్తలను వెంటనే ఖండించవలసి ఉండేది కానీ ఇటువంటి పరిస్థితులలో వాటిని ఖండించకపోయినా కొత్తగా జరిగే నష్టం ఏమీ లేదు. అయినా కిషన్ రెడ్డి ఖండించడం గమనిస్తే బహుశః ఆయన వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెదేపాతో స్నేహం కొనసాగించడమే మంచిదని అభిప్రాయపడుతున్నారనుకోవలసి ఉంటుంది.
ఏపిలో తెదేపాతో బీజేపీకి ఉన్న అవసరాల దృష్ట్యా తెలంగాణాలోనూ దానితో పొత్తులు కొనసాగించక తప్పదు. ఏపిలో మిత్రపక్షాలుగా ఉంటూ పొరుగునే ఉన్న తెలంగాణాలో శత్రువులుగా మెలగడం సాధ్యం కాదు కూడా. కనుక ఒకవేళ తాము తెదేపాతో పొత్తులు వ్యతిరేకించినా తమ అధిష్టానం అంగీకరించదని కిషన్ రెడ్డి గ్రహించే ఉంటారు. పైగా తెలంగాణాలో బలంగా ఉన్న తెదేపా-బీజేపీలు కలిసి పోటీ చేస్తేనే తెరాసను ఓడించలేకపోయినప్పుడు, ఇక ఒంటరిగా దానిని డ్డీ కొనడం అసాధ్యమనే విషయం ఆయన గ్రహించి ఉండవచ్చును.
ఒకవేళ తెదేపాతో పొత్తులు వద్దనుకొంటే అప్పుడు తెదేపాను కూడా ప్రతీ ఎన్నికలలో డ్డీ కొనవలసి ఉంటుంది. ఇవికాక రాష్ట్రంలో తెరాసకు అనుకూల వాతావరణం కలిగి ఉండటం, దాని దూకుడు, ప్రతిపక్ష పార్టీల నేతలను కార్యకర్తలను ఆకర్షించి వాటిని క్రమంగా అది నిర్వీర్యం చేస్తుండటం వంటి అనేక కారణాల చేత ఈ ఎన్నికలలో తమకు ఓటమి ఎదురయిందనే విషయం కిషన్ రెడ్డికి కూడా తెలుసు. బహుశః అందుకే కిషన్ రెడ్డి తెదేపాను వెనకేసుకు వచ్చి ఉండవచ్చును.