“మీరు ఇరుకిరుకు పూరిళ్లలో ఉండటానికి వీల్లేదు. మీ అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తం. రేపే అధికారులు మీ ఇండ్ల దగ్గరికి వస్తరు. మూడు నాలుగు నెలల్లో ఇండ్ల నిర్మాణం పూర్తయితది. అప్పుడు నేను మళ్లా వస్తా. దావత్ చేసుకుందాం”… 2015 జనవరి 10న వరంగల్ నగరంలోని మురికి వాడల ప్రజలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలివి.
“రెండు నెలల్లో మీకు డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తయితయి. మీకు ఇండ్లతో పాటు ఇంటికి రెండు ఆవులు గానీ గేదెలు గానీ ఇస్తం. అలాగే ఇంటికి పది కోళ్లను కూడా ఇస్తం. దత్తత గ్రామాలను సింగపూర్ లా అభివృద్ధి చేస్తం. ఈ గ్రామాలను గొప్పగా మారుస్తం”… శుక్రవారం నాడు ఎర్రవల్లిలో అదే కేసీఆర్ చెప్పిన మాటలివి.
వరంగల్ లో ఆయన ఘనంగా హామీ ఇచ్చి 17 నెలలు గడిచిపోయాయి. ఇప్పటి వరకూ ఇండ్ల నిర్మాణం కాదుగదా కనీసం ముగ్గుపోయలేదు. శంకుస్థాపన జరగలేదు.
భగత్ సింగ్ నగర్, దీన్ దయాళ్ నగర్, జితేంద్ర నగర్ తదితర మురికి వాడల ప్రజలకు అవే ఇరుకిరుకు పూరిళ్లలో ఉండక తప్పడం లేదు. ముఖ్యమంత్రి హామీ నెరవేరే రోజు కోసం వాళ్లు ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు.
వరంగల్ ప్రజలకు ఇచ్చిన హామీలకంటే ఘనమైన హామీలను ఎర్రవెల్లి గ్రామప్రజలకు ఇచ్చారు కేసీఆర్. ట్రిపుల్ ధమాకా అన్నట్టు ఇండ్లతో పాటు రెండు ఆవులు, 10 కోళ్లను కూడా ఇస్తామని ప్రకటించేశారు. మరి ఈ హామీలు కూడా వరంగల్ హామీల్లాగే అవుతాయా లేక నిజంగానే కార్యరూపం దాలుస్తాయా అని ఆ గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు.
కేసీఆర్ దత్తత గ్రామాలను సింగపూర్ లా అభివృద్ధి చేస్తే మరి మిగతా గ్రామాలను ఏం చేస్తారు? ఆశయం బాగానే ఉంది. ఆచరణే నిరాశ కలిగించేలా ఉంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఫలాలు ప్రజలకు పూర్తిగా అందితే కేసీఆర్ తిరుగులేని నాయకుడిగా ప్రజల మనసుల్లో స్థానం పొందుతారు. అయితే, కొన్ని విషయాల్లో ప్రభుత్వ పనితీరు పేలవంగా ఉంది.
సింగపూర్ సంగతి తర్వాత, రాజధాని నగరంలోనే రోడ్లు కనీసం రోడ్లు అని అనడానికి వీల్లేకుండా తయారయ్యాయి. ముఖ్యమంత్రి, మంత్రులు తిరిగే కొన్ని మార్గాలు బాగుంటే సింపూర్ అయిపోయనట్టు కాదు. నగరంలోని చాలా చోట్ల తండాల్లో కంటే ఘోరంగా తయారయ్యాయి. ముందు వీటిని బాగుచేసేలా అధికారులను ఆదేశించాలన్నది ప్రజలు, ప్రతిపక్షాల డిమాండ్.