ఆంధ్రప్రదేశ్‌లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. నిన్న రాత్రి తొమ్మిది గంటల తర్వాత అనుమానితులకు జరిపిన టెస్టుల్లో ఏకంగా పదిహేడు మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ రోగుల సంఖ్య 40కి చేరింది. ఈ పదిహేడు మందిలో అత్యధికం.. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లిన వారు.. వారి ద్వారా ఇతరులకు వైరస్ సోకిన వారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 మందికి వైరస్ సోకింది. గుంటూరు జిల్లాలో తొమ్మిది, విశాఖ జిల్లాలో ఆరు, కృష్ణా జిల్లాలో ఐదు మందికి.. తూర్పుగోదావరిజిల్లాలో నలుగురు, అంతపురం జిల్లాలో ఇద్దరికి చిత్తూరు, నెల్లూరు, కర్నూల్లో ఒక్కొక్కిరి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో అత్యధిక మందికి కరోనా సోకిందని అధికారులు గుర్తించడంతో ..అలా ప్రార్థనలకు వెళ్లిన వారందర్నీ అధికారులు గుర్తించేందుకు తంటాలు పడుతున్నారు. దాదాపుగా ప్రతీ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఈ మత సమావేశాలకు వెళ్లారని.. వీరి సంఖ్య ఐదువందల వరకూ ఉంటుందనే సమాచారం ప్రభుత్వానికి అందింది. వీరు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అనేక రకాల మత సమావేశాలతో పాటు.. వివిధ ఫంక్షన్లకు హాజరయ్యారు. ఈ కారణంగా.. కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉంటుందని అధికారవర్గాలు టెన్షన్ పడుతున్నాయి.
కాంటాక్ట్ కేసులు ఏపీలో అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లిన వచ్చిన వారి దగ్గర్నుంచి సులువుగా..ఈ కోవిడ్.. ఇతరులకు వ్యాపిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిపై ఎక్కువగా దృష్టి పెట్టిన అధికారులు.. ఢిల్లీ నుంచి వచ్చిన వారిని లైట్ తీసుకున్నారు. దీంతో.. ముప్పు మరో వైపు నుంచి ముంచుకొచ్చింది. వివిధజిల్లాల్లో పెద్ద ఎత్తున అనుమానితులు ఆస్పత్రులకు వస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది.. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారితో సన్నిహితంగా ఉన్న వారే. దీంతో పాటిటివ్ కేసులు మరింత పెరుగుతాయన్న అంచనాలు ఏర్పడుతున్నాయి.