మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ సి.ఎస్.కర్ణన్-సుప్రీం కోర్టుకి మద్య తలెత్తిన వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. మద్రాస్ హైకోర్టు తరపున సుప్రీం కోర్టులో హాజరయిన సీనియర్ న్యాయవాది కెకే. వేణుగోపాల్ మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ సి.ఎస్.కర్ణన్ తన బదిలీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను సుమోటుగా స్వీకరించి, దానిపై ఆయన స్టే విధించిన సంగతిని తెలియజేసారు. ఆయన కలకత్తా హైకోర్టుకి బదిలీ చేయబడ్డారు కనుక ఆయనకి ఎటువంటి న్యాయపరమయిన బాధ్యతలు అప్పగించవద్దని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపై ఆయన స్పందన గురించి కూడా సుప్రీం కోర్టుకి వేణుగోపాల్ తెలియజేసారు.
ఈ కేసును విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం, “ఒకవేళ జస్టిస్ సి.ఎస్.కర్ణన్ తనకు అన్యాయం జరిగినట్లు భావిస్తున్నట్లయితే వచ్చే నెల 9న ఆయన స్వయంగా సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు హాజరయ్యి వాదించుకోవచ్చును లేదా తన తరపున ఎవరయినా న్యాయవాదితో తన కేసును వాదించుకోవచ్చును,” అని తెలిపింది. అంతకుముందు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులలో చిన్న మార్పు చేసి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అప్పగించిన కేసులను మాత్రమే ఆయన చూడవచ్చునని పేర్కొంది. సుమోటుతో సహా ఆయన ఎవరికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనిపై ఆయన మళ్ళీ ఏవిధంగా ప్రతిస్పందిస్తారో చూడాలి. న్యాయమూర్తులందరినీ పార్లమెంటులో సభ్యుల సమక్షంలో తనతో బహిరంగ చర్చలో పాల్గొనమని సవాలు విసిరారు. సుప్రీం కోర్టులో తన కేసును వాదించుకోవడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది కనుక ఆయన స్వయంగా వాదించుకొంటారో లేక మళ్ళీ మరో వివాదం లేవనెత్తుతారో చూడాలి.