రెండో విడత లోక్ సభ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రచారానికి కూడా తెరపడింది. ఈ దశలో తమిళనాడులో జరుగుతున్న ఎన్నికలు కొంత ఆసక్తిని రేపుతున్నాయి. ఆ రాష్ట్రంలో 39 ఎంపీ సెగ్మెంట్లతోపాటు, 22 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. మాజీ ముఖ్యమంత్రి అమ్మ జయలలిత మరణం తరువాత ఏర్పడ్డ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 18 మంది సభ్యులపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. మరో నాలుగు స్థానాలు కూడా వివిధ కారణాల వల్ల ఖాళీ అయ్యాయి. రెండో దశ ఎన్నికల్లో భాగంగా 18 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన నాలుగు ఖాళీలకూ, నాలుగో దశలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడా స్థానాల్లో జరిగే ఎన్నిక కీలకంగా కనిపిస్తోంది.
రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తమకు కలిసి వస్తుందనే ధీమాతో డీఎంకే ఉంది. తూత్తుకుడి ఆందోళనలు, కొన్ని ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలు వంటివి వ్యతిరేకత పెంచాయని భావిస్తున్నారు. ఈ ఉద్యమాలకు కనిమొళి నాయకత్వం వహించడం కూడా ప్రభావంతంగా మారాయని భావిస్తున్నారు. అమ్మ మరణం తరువాత ప్రభుత్వం ఏర్పడ్డ తీరు మీద ప్రజల్లో విసుగు ఉందనీ, నిజమైన నాయకత్వం కోసం తమిళ ప్రజలు చూస్తున్నారని, ప్రత్యామ్నాయం స్టాలిన్ అని ప్రజలు తీర్పు నివ్వబోతున్నట్టు డీఎంకే వర్గాలు ధీమాగా ఉన్నాయి. పైగా, తమిళనాడులో భాజపా జోక్యం కూడా అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. లోక్ సభ ఎన్నికలతోపాటు, ఎమ్మెల్యే స్థానాలకు జరిగే ఉప ఎన్నికలపై కూడా ఈ పరిస్థితులు ప్రభావం చూపనున్నాయి.
సంఖ్యాబలం చూసుకుంటే తమిళనాడులో 118 అసెంబ్లీ స్థానాలు ఎవరికి ఉంటే వారు అధికారంలోకి వస్తారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వమ్ లు కలిసి సునాయాసంగా బలనిరూపణ చేసుకుని అధికారంలో కొనసాగుతున్నారు. ఇంకోపక్క, తానే అమ్మకు అసలైన వారసుడిని అంటూ దినకరన్ కూడా రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే, అమ్మ మరణానికి ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే 97 స్థానాలు డీఎంకే కైవసం చేసుకుని బలమైన ప్రత్యర్థిగానే నిలబడింది. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతున్న 22 స్థానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, అన్నీ గెలవాలన్న పట్టుదలతో డీఎంకే ఉంది. ఇంకోపక్క, దినకరన్ కూడా అన్ని చోట్లా అభ్యర్థులను పెట్టారు. ఈ 22 స్థానాలను ఆయన దక్కించుకుంటే… అమ్మకు అసలైన వారసుడు ఆయనేనేమో అనే చర్చ పళనిస్వామి మద్దతుదారుల్లో మొదలయ్యే అవకాశం ఉంది, దాన్ని తనకు అనుకూలంగా దినకరన్ మార్చుకునే పరిస్థితీ రావొచ్చు. మొత్తంగా, ఈ 22 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు అత్యంత కీలకంగా మారబోతున్నాయి.