18 pages movie telugu review
తెలుగు360 రేటింగ్ 3/5
ఈ యేడాది నిఖిల్ కి కలిసొచ్చింది. పెద్ద అంచనాలు లేకుండా వచ్చిన కార్తికేయ2 పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. ఇప్పుడు అదే ఉత్సాహంలో ’18 పేజెస్’ తో ప్రేక్షకుకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు సుకుమార్ ప్రేమ కథల స్పెషలిస్ట్. ఆయన అందించిన కథతో 18 పేజెస్ తెరకెక్కించాడు దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్. గతంలో’ కుమారి 21 F’ తో విజయాన్ని అందుకున్న కాంబినేషన్ ఇది. ఈసారి అల్లు అరవింద్ సమర్పణలో జీఏ పిక్చర్స్ లో 18 పేజెస్ బన్నీ వాసు నిర్మించారు. ట్రైలర్ క్యురియాసిటీని పెంచింది. సుకుమార్ మరో వైవిధ్యమైన ప్రేమ కథని ప్రేక్షకులు చూపించబోతున్నారనే నమ్మకం కలిగించింది. ఇంతకీ ’18 పేజెస్’ లో వున్న కథ ఏంటి ? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ?
సిద్ధు (నిఖిల్ ) ఓ కార్పోరేట్ కంపెనీలో యాప్ డెవలపర్. కంప్యూటర్, సెల్ ఫోనే అతడి ప్రపంచం. ఆన్ లైన్ లోనే ప్రీతి అనే అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. బ్రేక్ అప్ బాధలో మందుతాగుతూ రోడ్లపై తిరుగుతున్న సిద్ధుకి నందిని (అనుపమ పరమేశ్వరన్ ) 2020లో రాసుకున్న డైరీ దొరుకుతుంది. సిగరెట్ కాల్చుకోవడానికి ఓ పేజీని చింపుతుండగా డైరీలోని అక్షరాలు అతడ్ని ఆకర్షిస్తాయి. ఒకొక్క పేజీ చదువుతున్న కొద్ది నందిని వ్యక్తిత్వం సిద్దకి తెగ నచ్చేస్తుంది. నందిని పాతకాలం మనిషి. సెల్ ఫోన్ వాడదు. ప్రకృతికి దగ్గరగా బతుకుతుంటుంది. ఇవన్నీ నచ్చి నందినిని ప్రేమించేస్తాడు సిద్ధు. అయితే డైరీలో 18 పేజీలు తర్వాత ఖాళీగా వుంటుంది. 2020లోవెంకట్రావ్ అనే వ్యక్తిని కలవడానికి విజయనగరం నుంచి హైదరాబాద్ వస్తుంది నందిని. వెంకట్రావ్ ని కలిసిన రోజే ఆమె డైరీలో ఆఖరి పేజీ. ఆ తర్వాత నందిని ఏమైయింది? నందిని రాసిన డైరీని 2022లో చదువుతున్న సిద్ధుకి నందిని గురించి ఎలాంటి నిజాలు తెలిశాయి. చివరికి నందిని సిద్ధు కలుసుకున్నారా లేదా ? అనేది మిగతా కథ.
సుకుమార్ కలానికి రెండు వైపులా పదును. లాజిక్కులతో మ్యాజిక్ చేయగలదు. అదే సమయంలో భావోద్వేగాల్ని పలికించి మనసుని కదలించగలదు. 18 పేజెస్ కోసం రెండో పార్శ్వం చూపించారు సుకుమార్. రెండు తరాల లైఫ్ స్టయిల్ ని ఒక చోట చేర్చి అందులో నుంచి ఒక ప్రేమకథని చెప్పాలని అనుకున్నారు. ఈ ప్రయత్నం సుకుమార్ మార్క్ లోనే సాగింది. ఒకరిని ఒకరు చూసుకోకుండా ప్రేమించుకోవడం ప్రేమలేఖ, మనసంతా నువ్వే.. ఇలా కొన్ని సినిమాల్లో ఇదివరకు చూసిందే. సుకుమార్ ఇలాంటి లైనే ఎత్తుకున్నారు. కానీ ఈ కథని నడిపిన విధానంలో మాత్రం సుకుమార్ శైలి అడుగడుగునా కనిపిస్తుంది. హీరో బ్రేక్ అప్ ఎపిసోడ్ తో కథ మొదలౌతుంది. హీరో చేతికి డైరీ దొరకడంతో అసలు కథలోకి త్వరగానే వెళ్ళిపోయాడు దర్శకుడు. నందిని పాత్ర పరిచయం చేసిన విధానం.. 2020, 2022 రెండు కాలాల్లో కథని నడిపే తీరు ఆకట్టుకుంటుంది. నందిని పాత్రలో అతి మంచి కనిపించినప్పటికీ.. ఆ మంచితనాన్ని కథలో భాగం చేసిన తీరు మాత్రం నచ్చుతుంది.
ఉదాహరణకు.. నందిని సెల్ ఫోన్ వాడదు. దీంతో సిద్ధు కూడా సెల్ ఫోన్ వాడకం మానేస్తాడు. ఇది కొంచెం అతి అనిపిస్తుంది. కానీ దిని ద్వారా కథకుడు చెప్పదలచుకున్న విషయం తెలుసుకున్నపుడు నిజమే కదా అనిపిస్తుంది. సిద్ధు తాతయ్య మతి స్థిమితం కోల్పోయి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. పోలీసు కంప్లయింట్ ఇస్తారు. సిద్ధు రోజు ఆఫీసు నుండి వచ్చే దారిలో ఓ బిచ్చగాడికి డబ్బులు ఇస్తుంటాడు కానీ అతడి మొహం చూడడు. సెల్ ఫోన్ వాడటం మానేయడం వలన తొలిసారి ఆ బిచ్చగాడిని చూస్తాడు. ఆ బిచ్చగాడు ఎవరో కాదు.. సిద్ధు తాతయ్యే. ఈ సీన్ చూస్తున్నపుడు ‘వావ్ సుకుమార్’ అనాలనిపిస్తుంది. ఇదే కాదు హ్యూమన్ ఇంటరాక్షన్ పాయింట్ ని కూడా ఇందులో టచ్ చేశారు. అయితే ఇవన్నీ కూడా సందేహం ఇచ్చేట్లుగా వుండవు. ఒకొక్క పేజీలో మంచి కంటెంట్ వున్న ఫీలింగ్ లోనే నడుస్తుంటాయి. అసలు సిద్ధు, నందిని చివరికి కలుస్తారా లేదా ? ఎక్సయిట్ మెంట్ ని విరామం వరకూ చక్కగా నడిపించారు.
విరామం తర్వాత ’18 పేజెస్’ ప్రేమకథ కాస్త సస్పెన్స్ థ్రిల్లర్ గా మారుతుంది. తొలి సగంలో కీలకమైన నందిని పాత్ర విరామం తర్వాత కనిపించదు. నందిని వెంకట్రావ్ ని కలిసిన తర్వాత ఏం జరిగిందో అనే విచారణ పర్వాన్ని సిద్ధు భుజాలకు ఎత్తుకుంటాడు. ఈ క్రమంలో కొన్ని కొత్త పాత్రలు తెరపైకి వస్తాయి. అసలు నందినికి ఏం జరిగిందనే క్యురియాసిటీ ప్రేక్షకుల్లో కలగాలనేది దర్శకుడు ఆలోచన. ఈ విషయంలో దర్శకుడు విజయం సాధించాడు. ఒక రియలెస్టేట్ కంపెనీ, ఆనాధశ్రమం చుట్టూ నడిపే కొన్ని సన్నివేశాలు సుకుమార్ స్టయిల్ లో కాస్త తికమక పెట్టినా.. ఆ ఎపిసోడ్ ని త్వరగానే ముగించారు. చివర్లో నందిని కనిపించిన సీన్ కి థియేటర్లో చప్పట్లు పడతాయి. అలాగే ట్రైన్ సిద్ధు, నందిని ట్రైన్ లో కలిసినప్పుడు.. ఒకరిని ఒకరు గుర్తుపెట్టుకునే సన్నివేశం బావుంటుంది. ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడకపోవడం ఒక వింతగా తోస్తుంది. సుకుమార్ కూడా ఆ క్యాలిటీని హీరో హీరోయిన్లు ఒకరికి ఒకరు గుర్తుపట్టుకునే కొండగుర్తుగా వాడిన విధానం బావుంటుంది. అలాగే ‘రెండు చుక్కల నిమ్మరసం’ అనే మాట కూడా ఒక కొండ గుర్తు. ట్రైన్ లో సిద్ధు’ రెండు చుక్కల నిమ్మర’సం అన్నపుడు థియేటర్లో విజల్స్ పడ్డాయి. ఇది స్క్రీన్ ప్లే మ్యాజిక్కే.
18 పేజెస్ లో కొన్ని బలహీనతలు కూడా కనిపిస్తాయి. విరామం తర్వాత నందిని పూర్తి చేయాల్సిన పనులని సిద్ధు పూర్తి చేస్తాడు. ఇది కాస్త షార్ఫ్ చేయాల్సింది. అలాగే రియలెస్టేట్ కంపెనీ, ఆనాధశ్రమం, నందిని యాక్సిడెంట్ చుట్టూ నడిపే సన్నివేశాలు కూడా కొంత తికమక పెడతాయి. కొన్ని సీన్లు రిజిస్టర్ కాకుండానే హడావిడిగా ముగించేసిన భావన కలుగుతుంది. అయితే ముగింపుని ఫీల్ గుడ్ గా రాసుకోవడంతో ఇవన్నీ మాఫీ అయిపోయాయి.
లవర్ బాయ్ పాత్రలో నిఖిల్ కి అలవాటే, సిద్ధు పాత్రని సులువుగానే చేశాడు. మంచి ఈజ్ చూపించాడు. తన లుక్ బావుంది. స్టయులీష్ కూడా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్ లో తన నటన ఆకట్టుకుంది. అనుపమకి మంచి పాత్ర దక్కింది. టైటిల్ రోల్ ఆమెదే. అనుపమ మంచి నటి. ఇందులో మరోసారి తన ప్రతిభ చూపే అవకాశం దక్కింది. ఫ్రండ్ పాత్రలో సరయు తెలంగాణ యాసలో కొన్ని చోట్ల నవ్విస్తుంది. అజయ్, పోసాని కృష్ణ మురళి, శత్రు, దినేష్ తేజ్ పరిధిమేర నటించారు.
గోపి సుందర్ సంగీతం ఆకట్టుకుంది. ఏడు రంగులు, నన్నయ్య రాసిన పాటలు చూడటానికి కూడా బావున్నాయి. నేపధ్య సంగీతం ఎమోషనల్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. కెమరాపనితనం కూడా ఆకట్టుకుంది. ప్రేమించిన అబ్బాయి మోసం చేసాడని ఓ అమ్మాయి బాధపడుతుంటే.. ‘చీట్ చేశారంటే ప్రేమించలేదనేగా అర్ధం. దానికి బాధ పడటం ఎందుకు” అనే డైలాగ్ సుకుమార్ మార్క్ లో వుంటుంది. చాలా మాటల్లో నవ్యత కనిపించింది. సుకుమార్ కథని తన శక్తి మేరకు తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సూర్య ప్రతాప్. కథకు కావాల్సింది సమకూర్చారు నిర్మాత. ఎక్కడా అసభ్యత లేని ఒక క్లీన్ చిత్రాన్ని తీసిన నిర్మాతలని మెచ్చుకోవాలి. కొత్తగా చెప్పాలే కానీ ప్రేమ కథని చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధమే. ఆ కొత్తదనం వున్న చిత్రం’18 పేజెస్’.
ఫినిషింగ్ టచ్: సుకుమార్ ప్రేమ పేజీలు
తెలుగు360 రేటింగ్ 3/5