ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు శరవేగంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి… మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశిచింది. ఇప్పుడు వినాయకచవితి రోజు సెలవు అయినప్పటికీ… సబ్ కమిటీలు నియమిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రస్థాయి కమిటీకి ప్రత్యేక ఉప సంఘాలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లాల సరిహద్దుల నియంత్రణ, న్యాయ వ్యవహారాల అధ్యయనం ఓ కమిటీకి… సిబ్బంది పునర్విభజన అధ్యయనం మరో కమిటీకి.. ఆస్తులు, మౌలిక సదుపాయాలపై మరో కమిటీ.. సాంకేతిక సంబంధిత అవసరాల అధ్యయనానికి మరో కమిటీని ఏర్పాటు చేశారు.
ఇక సీఎస్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి .. అలాగే ఇతర అంశాలపై ఏర్పాటైన నాలుగు సబ్ కమిటీలకు సాయం చేసేందుకు.. జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఛైర్మన్గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీని నియమించారు. అలాగే.. సీఎస్ నేతృత్వంలోని కమిటీకి..ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం… పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాలు చేయాల్సి ఉంది.
మొత్తంగా సీఎస్ నేతృత్వంలో కమిటీ..నాలుగు సబ్ కమిటీలు.. పదమూడు జిల్లాలకు పదమూడు కమిటీలు.. ఇలా మొత్తం జిల్లాల విభజనకు పద్దెనిమిది కమిటీల్ని నియమించినట్లయింది. అయితే.. పార్లమెంటరీ నియోజవర్గాల వారీగా విభజిస్తే.. అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఏర్పడింది. అదే సమయంలో జిల్లాల కోసం… అనేక డిమాండ్లు వస్తున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుందన్న చర్చ జరుగుతోంది. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించడానికి జిల్లా స్థాయి వరకూ కమిటీల్ని నియమించినట్లుగా చెబుతున్నారు.