చిరు అభిమానులు ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే సినిమా ఇంద్ర. అప్పట్లో ఆల్ టైమ్ రికార్డు సాధించింది. వసూళ్లలో, వంద ఆడిన సెంటర్ల పరంగానూ.. కొత్త అంకెలు నమోదు చేసింది. దాయి దాయి దామ్మ పాటకు చిరు వేసిన వీణ స్టెప్పు కోసమైతే – మళ్లీ మళ్లీ ఈ సినిమా చూశారు జనాలు. వైజయంతీ మూవీస్ అందుకున్న భారీ విజయాలలో ఇదొకటి. ఫ్యాక్షన్ కథల్లో ఇంద్ర మరో అరుదైన మైలు రాయి. ఇంద్ర తరవాత.. మళ్లీ ఆ స్థాయిలో ఓ ఫ్యాక్షన్ కథ విజయాన్ని అందుకోలేకపోయింది. ఓ రకంగా ఇంద్రతోనే ఫ్యాక్షన్ కథల వైభవం, వైభోగం ఆగిపోయింది. అయితే ఇంద్ర వెనుక చాలా ఆసక్తికరమైన సంగతులు.. సంఘటనలు ఉన్నాయి. నేటితో ఇంద్ర విడుదలై 18 ఏళ్లు. ఈ సందర్భంగా ఆ విషయాల్ని ఓసారి గుర్తు చేసుకుంటే…
* వైజయంతీ మూవీస్ అంటే చిరుకి ప్రత్యేకమైన అభిమానం. ఓరోజు అశ్వనీదత్‌ని పిలిచి… `కథ రెడీ చేసుకో..` అంటూ కాల్షీట్లు ఇచ్చేశారు చిరు. చిరు డేట్లు ఇస్తే.. అంతకంటే కావల్సింది ఏముంది? అందుకే.. వెంటనే కథాన్వేషణలో పడ్డారు అశ్వనీదత్.
* ఈ క్రమంలో చిన్నికృష్ణ చెప్పిన కథ అశ్వనీదత్‌కి బాగా నచ్చింది. పరుచూరి సోదరులు కూడా ఈ కథకు పచ్చజెండా ఊపారు. ఆ కథకు బి.గోపాల్ అయితే న్యాయం చేస్తాడని నమ్మకం. ఎందుకంటే ఇదో ఫ్యాక్షన్ కథ. చిరు ఇలాంటి కథ ఇది వరకు చేయలేదు. ఆ కథలతో హిట్టు కొట్టడం ఎలాగో బాగా నేర్చుకున్నారు బి.గోపాల్. బాలయ్యతో తీసిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు రెండూ సూపర్ హిట్టయ్యాయి. సో.. బి.గోపాల్ నే ఏకైక ఆప్షన్.
* కానీ.. బి.గోపాల్ మాత్రం ఈ కథ చేయడానికి అంగీకరించలేదు. వరుసగా ఫ్యాక్షన్ కథలే చేస్తున్నా.. అన్నది ఆయన ఫీలింగ్. పైగా చిరుతో ఇది వరకు చేసిన మెకానిక్ అల్లుడు సినిమా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. మళ్లీ చిరుతో ఓ తప్పు చేయడం తనకు ఇష్టం లేదు. మరో ఫ్లాప్ ఇస్తే.. ఎప్పటికీ చిరుతో మరో సినిమా చేయలేనేమో అనే భయం పట్టుకుంది. దాంతో ఆయన అశ్వనీదత్నీ, పరుచూరి వాళ్లని తప్పించుకుని తిరగడం మొదలెట్టారుజ
* కానీ పరుచూరి సోదరులు పట్టువదలని విక్రమార్కుల్లా.. బి.గోపాల్ ని ఒప్పించారు. చిరుకి కథ చెప్పే బాధ్యత పరుచూరి వాళ్లే స్వీకరించారు. ఫస్టాఫ్ అవ్వగానే చిరుకి కథ నచ్చేసింది. గో ఎహెడ్ అంటూ ఆయనా పచ్చజెండా ఊపారు.
* నిజానికి గోదావరి బ్యాక్ డ్రాప్ తో ఈ కథ రాసుకున్నారు. కానీ.. మార్పులు చేర్పుల్లో అది కాశీ బ్యాక్ డ్రాప్ గా మారింది.
* ఫ్యాక్షన్ సినిమా అంటే భారీ డైలాగులు ఉంటాయి. ఇది వరకు బాలయ్య కోసం పరుచూరి బ్రదర్స్ ఇలాంటి డైలాగులు రాశారు కూడా. కానీ చిరు మాత్రం `నాకు మరీ అంత హెవీ డైలాగులు వద్దు` అనేసరికి డైలాగుల్లో మోతాదు తగ్గించి రాశారు.
* ఇంద్ర ఆడియో ఫంక్షన్లో అభిమానులంతా.. `డైలాగ్.. డైలాగ్` అంటూ అభ్యర్థించడం చూసిన చిరు..స
`ఇప్పటికే 80 శాతం సినిమా పూర్తయ్యింది. మిగిలిన 20 శాతం సినిమాల్లో భారీ డైలాగులు ఉండేలా చూడండి..` అని పరుచూరి సోదరుల్ని అడగడంతో… పరుచూరి బ్రదర్స్ తమ స్టైల్‌కి దిగి సంభాషణలు రాసిచ్చారు.
* ఆర్తి ఆగర్వాల్ ఇంటికి వెళ్లిన చిరు `రాననుకున్నారా.. రాలేననుకున్నారా` అని చెప్పే సీన్ ఉంది కదా. నిజానికి స్క్రిప్టులో ఈ సన్నివేశం లేదు. షూటింగ్ అంతా పూర్తయ్యాక.. రాసిన సీన్ ఇది. అప్పటికప్పుడు కట్ చేసిన ఈ సీన్‌ని అర్థరాత్రి 12 గంటలకు చిరుని నిద్రలేపి మరీ చూపించారు అశ్వనీదత్.
* ముందు అనుకున్న కథ ప్రకారం సునీల్ పాత్ర చనిపోతుంది. కానీ.. కథానాయికకు నిజం ఎవరు చెప్పాలి? ఎలా తెలియాలి? అనే తర్జనభర్జనల్లో మళ్లీ ఆ పాత్రని బతికించారు. సునీల్ పాత్రతోనే.. ఆర్తికి అసలు నిజం అర్థం అవుతుంది.
* పరుచూరి సోదరులు రాసిన సంభాషణలు నచ్చడంతో.. సెట్లోనే ఖరీదైన సెల్ ఫోన్ ని బహుమతిగా అందజేశారు చిరు.
* పతాక సన్నివేశాల్లో విలన్ చిరు కాళ్లమీద పడతాడు. అక్కడ చిరు కోసం మూడు పేజీల డైలాగులు రాశారు. విలన్ తల వంచాక కూడా మూడు పేజీల డైలాగ్ అవసరమా? అని చిరంజీవికి సందేహం వచ్చింది. దాంతో అప్పటికప్పుడు ఆ మూడు పేజీల్ని కుదించి.. ఒక్క డైలాగ్ కి మార్చారు. మరీ ఒక్క డైలాగా? అని చిరు ఆశ్చర్యపోయారు. చివరికి ఆ డైలాగే మూడు పేజీలకు సరిసమానం అని చిరు భావించి, ఆ డైలాగ్ చెప్పేశారు. అదే.. `నరుక్కుంటూ పోతే అడవి కూడా మిగలదు. చంపుకుంటూ పోతే.. మనిషన్నవాడు మిగలడు`.
* సినిమా పూర్తయ్యింది. మూడు గంటల నిడివి వచ్చింది. అంతా బాగుందంటూ మెచ్చుకున్నారు. కానీ పరుచూరి సోదరులు మాత్రం `నిడివి ఎక్కువైంది` అని చెప్పడంతో చిరు… వాళ్ల మాటలతో ఏకీభవించి.. అప్పటికప్పుడు 20 నిమిషాల సన్నివేశాల్ని దగ్గరుండి ట్రిమ్ చేయించారు.
( పరుచూరి గోపాలకృష్ణ ఇంటర్వ్యూ ఆధారంగా)