వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరో విచిత్రమయిన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అవిశ్వాసం ప్రకటిస్తూ శాసనసభ కార్యదర్శికి వైకాపా నోటీస్ అందజేసింది. వచ్చే నెల నుండి మొదలయ్యే శాసనసభ సమావేశాలలో దాని కోసం పట్టుబట్టాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకొన్నారు. అంతవరకే అయితే అందులో అసహజమేమీ లేదు. కానీ ఎప్పుడూ ఒకే దెబ్బకు రెండు మూడు పిట్టలు కొట్టాలని ప్రయత్నించే అలవాటున్న జగన్ ఈసారి దీనితో కూడా రెండు పిట్టలు కొట్టాలని ప్రయత్నించబోతున్నట్లు సమాచారం.
అదేమిటంటే, ఒకటి: అవిశ్వాస తీర్మానం పేరుతో సభను స్తంభింపజేయడం. రెండు: దాని కోసం తమ పార్టీ ఎమ్మెలకి విప్ జారీ చేసి, పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు దానిని అతిక్రమించినప్పుడు వారిపై అనర్హత వేటు కోసం స్పీకర్ పై ఒత్తిడి చేయడం! ఇది వింటుంటేనే ఈ ఆలోచన ఎంత విచిత్రంగా, అసహజంగా ఉందో అర్ధమవుతుంది.
స్పీకర్ పై తాము ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానాన్ని శాసనసభలో ఆమోదింపజేసుకొనేందుకు తగినంత సంఖ్యాబలం తమకు లేదని తెలిసి ఉన్నప్పటికీ జగన్ అందుకు సిద్దపడటం వలన, అది వీగిపోయినప్పుడు నవ్వులపాలయ్యేది వైకాపాయే. స్పీకర్ పై అవిశ్వాసం ప్రకటించాలనుకొంటే కేవలం దాని కోసమే ప్రయత్నించినా బాగుండేది. కానీ ఆ వంకతో విప్ జారీ చేసి పార్టీ ఫిరాయించిన తమ నలుగురు ఎమ్మెల్యేలని ఇరకాటంలో పెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పార్టీ విప్ ని అతిక్రమించినందుకు వారిపై అనర్హత వేటు వేయాలంటే మళ్ళీ దాని కోసం తాము అవిశ్వాసం ప్రకటించిన స్పీకర్ కోడెల శివప్రసాద రావునే వైకాపా ఆశ్రయించవలసి ఉంటుంది. అది మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది. అంటే స్పీకర్ పై తమ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని, మళ్ళీ అదే స్పీకర్ ను తాము ఆశ్రయించవలసి ఉంటుందని ఖచ్చితం తెలిసి ఉన్నప్పటికీ, అవిశ్వాసం పెట్టడం వలన జగన్ దీనిని ఒక ఆటగా భావిస్తున్నట్లు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది.
పార్టీ ఫిరాయించిన తమ సభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుకొంటే అందుకు అధికార, ప్రతిపక్షాలకు తలవంపులు తెచ్చే ఈ డ్రామా ఆడవలసిన అవసరం లేదు. నేరుగా స్పీకర్ ని కలిసి వారిపై అనర్హత వేటు వేయమని కోరవచ్చును. కానీ దానికి అవిశ్వాస తీర్మానాన్ని వాడుకోవాలనుకోవడమే చాలా అసహజమయిన ఆలోచన. ఇంతా చేసి జగన్ అనుకొన్న వాటిలో ఏ ఒక్కటయినా సాధించగలరా అంటే అదీ సాధ్యం కాదనే గతానుభవాలు తెలియజేస్తున్నాయి.
తెలంగాణాలో పార్టీ ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయమని తెదేపా, కాంగ్రెస్ పార్టీ, చివరికి వైకాపా కూడా పోరాటం చేసినా అది ఫలించలేదు. ఆ నేపధ్యంలో చూసినట్లయితే ఇక్కడ కూడా అదే జరుగబోతోందని అర్ధం అవుతోంది. అయినా కూడా పార్టీ ఫిరాయించిన ఆ నలుగురు వైకాపా ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేస్తారని, అప్పుడు ఉపఎన్నికలు వస్తాయని, వాటిలో మళ్ళీ తామే గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి పగటికలలుకంటున్నారు.