చావులతో రాజకీయం చేయడం ఇండియాలో రాజకీయంగా లాభసాటి వ్యవహారంలా మారిపోయింది. ఓ వైపు జనం చస్తున్నా .. కనీసం సాయం చేసే ప్రయత్నం చేయకుండా.. చావులకు కారణం.. మీరంటే మీరని వాదించుకునే దుష్ట రాజకీయానికి పార్టీలు పాల్పడుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో జరిగిన ఆక్సీజన్ ట్యాంకర్ లీకేజీ ప్రమాద ఘటనపై మహారాష్ట్రలో ఇదే తరహా రాజకీయం జరుగుతోంది. మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఆస్పత్రిలో ఆక్సీజన్ ట్యాంకులు ఉన్నాయి. అక్కడ్నుంచి నేరుగా ఐసీయూలోని రోగులకు సరఫరా చేస్తారు. వాటిలో ఆక్సీజన్ నింపడానికి తీసుకొచ్చిన ట్యాంకర్ నుంచి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అక్సిజన్ లీకయిపోయింది.
దీంతో అరగంట పాటు ఐసీయూలో ఉన్న రోగులకు ఆక్సీజన్ ఆగిపోయింది. ఫలితంగా ఇరవై రెండు మంది రోజులు ప్రాణాలు కోల్పోయారు. అసలు తప్పెక్కడ జరిగిందో విశ్లేషించి… ఎందుకు.. అలా జరిగిందో తేల్చి… బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన నేతలు… కారణంగా మీరంటే మీరని ఆరోపణలు చేసుకోవడం ప్రారంభించారు. ఈ ప్రమాదానికి శివసేన సర్కార్ కారణమని… ఘటన జరిగిన గంటలోనే మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ బరద చల్లేశారు. శివసేన మాత్రం ఏం తక్కువ తింటుంది.. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ చేతుల్లో ఉందని.. ఆ ఆస్పత్రి కూడా కార్పొరేషన్ నిర్వహిస్తోందని ఎదురుదాడికి దిగింది.
ఈ ఆరోపణలు.. ప్రత్యారోపణలకు ఇక హద్దు ఉండదు. అదే సమయంలో జరిగిన ఘటనపై మోడీ, షాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందరూ కలిసి… ఈ ఘటనను రాజకీయం చేశారు కానీ.. మానవత్వ కోణంలో ఒక్కరూ చూడలేదు. దేశంలో ప్రతి విషాదం కూడా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేసుకోవడానికి సమయం కేటాయిస్తున్నారు. కానీ చిన్న చిన్న మానవ తప్పిదాల వల్ల వందల ప్రాణాలు పోతున్నా.. కనీసం లెక్క చేయడం లేదు.