కొన్ని సినిమాలకు కాలదోషం ఉండదు. ఎప్పుడు చూసినా ఓ ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి సినిమాల్లో `మనసంతా నువ్వే` ఒకటి. తెలుగు చలన చిత్ర చరిత్రలో… మైలురాళ్లుగా నిలబడిపోయే అత్యంత అరుదైన చిత్రాలలో `మనసంతా నువ్వే` కూడా ఉంటుంది. వి.ఎన్.ఆదిత్య అనే దర్శకుడ్ని తెరకు పరిచయం చేసిన సినిమా ఇది. ఉదయ్‌కిరణ్ ఖాతాలో మరో సూపర్ హిట్. ఆర్పీ సంగీత ప్రభంజనంలో మరో మైలురాయి. ఎం.ఎస్.రాజు నిర్మాణ దక్షతకు, జడ్జిమెంట్ కీ, కష్టానికి చక్కటి ప్రతిఫలం.
దేవీ పుత్రుడు తీసి.. తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయినప్పుడు – ఆసరాగా ఓ చిన్న సినిమా తీసి, మళ్లీ తన బ్యానర్ పరువు ప్రతిష్టల్ని నిలపాలన్న సంకల్పంలోంచి `మనసంతా నువ్వే` ఆలోచన పుట్టుకొచ్చింది. దేవీ పుత్రుడు తీసి ఏకంగా 14 కోట్లు పోగొట్టుకున్నారు ఎం.ఎస్‌రాజు. ఆయన పనైపోయిందని ఫిల్మ్ నగర్ అంతా టాక్. ఈ దశలో.. ఓ చిన్న సినిమా తీయాలన్న ఆలోచవచ్చిందాయనకు. చిన్నప్పుడే విడిపోయిన హీరో, హీరోయిన్లు.. పెద్దయ్యాక ఎలా కలుసుకున్నారు? అనే కాన్సెప్టుతో సినిమా చేద్దామనుకున్నారు. ఈ పాయింట్ తో.. కోడి రామకృష్ణతో సినిమా తీద్దామని ఫిక్సయ్యారు. కానీ అప్పటికి కోడి రామకృష్ణ బిజీ. పైగా ఇదో ప్రేమ కథ కాబట్టి, కొత్త కుర్రాడికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందనిపించించింది. కెమెరామెన్ ఎస్.గోపాల్ రెడ్డి సలహాతో.. వి.ఎన్.ఆదిత్యకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు రాజు.
ఆయన అప్పటికే `అన్మోల్ ఘడీ` అనే ఓ హిందీ చిత్రాన్ని చూసి ఉండడంతో.. ఆస్ఫూర్తితో.. ఓ కథ అల్లుకున్నారు. మనసంతా నువ్వేలో ఉదయ్ కిరణ్ – సునీల్ వర్షంలో తడుచుకుంటూ బాధపడే సీన్ ఒకటుంది. ముందు ఆ సీన్ రాసి.. ఎం.ఎస్ రాజుకి చూపించాడు విఎన్ ఆదిత్య. ఆ సీన్ బాగా నచ్చడంతో అప్పటికప్పుడు ఈ సినిమాకి దర్శకుడిగా ఆదిత్య పేరు ఖరారు చేశారు.
కథంతా అయ్యాక హీరోగా మహేష్‌బాబుని తీసుకుందాం అనుకున్నారు. అయితే అప్పటికే మహేష్ కి ఓ ఇమేజ్ అంటూ ఏర్పడింది. అందుకే ఎలాంటి ఇమేజ్ లేని ఓ కొత్త కుర్రాడికి అవకాశం ఇద్దాం అనుకున్నారు. తేజ రికమెండేషన్ తో ఈ సినిమాలోకి ఉదయ్ కిరణ్ వచ్చాడు. స్టోరీ సిట్టింగ్స్ అంతా అరకులోనే జరిగాయి. ఆర్పీ పట్నాయక్ ఒకే ఒక్క రోజులో మెత్తం పాటలన్నీ ట్యూన్ చేసి ఇచ్చేశారు. ఈసినిమాలోని `తూనీగ తూనీగ` అనే పాట సూపర్ హిట్. అయితే ఈ ట్యూన్ కి మలయాళ గీతానికి రీమిక్స్ లాంటిది.
2001 అక్టోబరు 19న విడుదలైన మనసంతా నువ్వే.. సూపర్ డూపర్ హిట్టయ్యింది. చిన్న బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా భారీ లాభాల్ని తీసుకొచ్చింది. అంతకు ముందు `దేవీ పుత్రుడు` చేసిన అప్పులన్నీ ఈ సినిమా తీర్చేసింది. పాటలన్నీ సూపర్ హిట్. ఉదయ్ కిరణ్- రీమాసేన్ ల జంట మళ్లీ కుర్ర హృదయాల్ని ఆకట్టుకుంది. సునీల్ చేసిన కామెడీ మరో హైలెట్. మొత్తానికి స్టార్ హీరో సినిమాతో అప్పుల పాలైన నిర్మాత.. ఓ కొత్త కుర్రాడితో సినిమా తీసి, ఆ అప్పుల్ని తీర్చుకోవడమే కాకుండా ఇండ్రస్ట్రీకి ఓ దర్శకుడ్ని పరిచయం చేయగలిగాడు. అదీ.. చిన్న సినిమాల మ్యాజిక్.