దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి? మనకు సాధారణంగా ఒక సామెత వినిపిస్తూ ఉంటుంది. ‘దొంగ చేతికి తాళాలిస్తే సరి’ అని! ఆ సామెత నిజం అని నిరూపించడానికి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస సర్కార్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. శాసనసభలో అల్లర్లు జరగకుండా, సభా మర్యాదలకు భంగం కలగకుండా, సాంప్రదాయాలు చెడిపోకుండా, క్రమశిక్షణ ఉల్లంఘన జరగకుండా ఉండాలంటే.. ఏం చేయాలి? అనే ప్రశ్నకు పైన చెప్పుకున్న సామెత ప్రకారం.. ”అలాంటి వారికే అధికారం అప్పగిస్తే సరి” అనే జవాబు వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో అదే జరిగింది గనుక. అలా అల్లర్లు చేసే తమ పార్టీ చేతికే ప్రజలు తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టారు గనుక.. సభలో ఇక ఎలాంటి అల్లరి జరగకుండా చూడడానికి కేసీఆర్ సర్కారు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది.
దొంగ చేతికి తాళాలివ్వడం వలన రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఉన్న సొత్తులో ఏది చోరీకి గురయినా తాళాలు ఉన్నందువలన బాధ్యత తనదే గనుక.. తాను దొంగిలించకుండా ఉంటాడు. రెండోది ఏంటంటే… తాను స్వతహాగా దొంగ గనుక.. దొంగలు ఎలాంటి రకాలుగా చోరీలు చేస్తారో తనకు విపులంగా తెలుసు గనుక.. ఆయా మార్గాల్లో చోరీలు జగరకుండా తానే కట్టడి చేస్తూ ఉంటాడు.
ఇప్పుడు శాసనసభలో అల్లర్ల విషయంలో.. తెరాస సర్కారు కూడా ఈ రెండు రకాల పద్ధతులను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అధికారం తమ చేతిలోనే ఉన్నది గనుక వారు అల్లరి చేయడం అంటూ జరగదు. కాకపోతే ఇతర సభ్యులు ఎలాంటి అల్లర్లు చేయడానికి అవకాశం ఉంటుందో.. అలాంటి మార్గాలన్నిటినీ మూసి వేయాలని వారు కృతనిశ్చయంతో ఉన్నట్లుంది. గవర్నరు ప్రసంగాన్ని అడ్డుకుంటే ఏడాది పాటు సస్పెన్షన్, సభలోకి ప్లకార్డులు తేరాదు, గోల చేయరాదు, పోడియం వద్దకు వెళ్లరాదు, తదితర అనేకమైన కొత్త క్రమశిక్షణ రూల్సును వారు తయారుచేశారు. అయితే అవన్నీ పైన చెప్పుకున్నట్లు తెరాస గతంలో విచ్చలవిడిగా ఫాలో అయిన మార్గాలే. అందుకే వాటి మీద క్లారిటీ ఉంది గనుక.. ఇప్పుడు తమ పాలనలో మరొకరికి ఆ అవకాశం లేకుండా చేసేస్తున్నారు.
విపక్షాలు మాత్రం.. సభలో కొత్త నిబంధనల పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి సర్కారు ప్రయత్నిస్తున్నదంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయినా వారి మొర ఆలకించడానికి ఎవరున్నారని?