ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లున్నాయి అమరావతి గురించి వినిపిస్తున్న కధలు. ఈ మిగిలిన మూడేళ్ళలో అమరావతి నిర్మాణం మొదలుపెడతారో లేదో కూడా తెలియని పరిస్థితులు కనిపిస్తుంటే, అమరావతి నిర్మాణంలో పాలు పంచుకొనే జపాన్ సంస్థలలో ఉద్యోగాలు పొందడం కోసం యువతకు జపనీస్ బాషలో శిక్షణ ఇవ్వడం గురించి వార్తలు వింటుంటే నవ్వు వస్తుంది.
అమరావతిలోనే రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకొంటామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ కి హామీ ఇవ్వడం కూడా అలాగే ఉంది. ఆయన ఇస్తున్న ఈ హామీ రాజధాని మొదటి దశ నిర్మాణం పూర్తయినప్పుడు అమలు చేయడానికి వీలవుతుంది తప్ప ఇప్పటికిప్పుడు అమరావతిలో హైకోర్టు నిర్మాణం చేయడం సాధ్యం కాదని అందరికీ తెలుసు.
విభజన సమయంలో రాజధాని నిర్మాణానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని కేంద్రం రాష్ట్రానికి హామీ ఇచ్చినప్పటికీ, మోడీ ప్రభుత్వం దానికి కూడా కొంచెం కత్తెర వేసి రాజధాని నిర్మాణానికి కేవలం రూ.25,000 కోట్లు మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పింది. కనుక అమరావతి నిర్మాణం కోసం సింగపూర్ చుట్టూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రదక్షిణాలు చేయక తప్పడం లేదు. సింగపూర్ సంస్థలు స్విస్ చాలెంజ్ పద్దతిలో రాజధాని నిర్మాణానికి సిద్దంగా ఉన్నప్పటికీ వాటి గొంతెమ్మ కోర్కెలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చలేకపోతోంది.
కనుక రాజధాని నిర్మాణం ఇంకా ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితిలో అమరావతిలో హైకోర్టు ఏర్పాటు, జపనీస్ బాష నేర్చుకోవడం వంటి మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రజలందరూ సింగపూర్ సంస్థలు గీసిచ్చిన అందమయిన అమరావతి ఫోటోలను చూసుకొంటూ, తాత్కాలిక సచివాలయం గురించి కబుర్లు వింటూ కాలక్షేపం చేసుకోక తప్పదు.