రాష్ట్ర విభజనతో తెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్ అస్తవ్యస్తం అవుతుందని అందరూ భయపడ్డారు కానీ తెలంగాణా ప్రభుత్వం సినీ పరిశ్రమను చక్కగా ఆదరిస్తుండటంతో నెల్లూరు లేదా విశాఖకు తరలిపోవాలనే ఆలోచనలను పక్కనబెట్టి నేటికీ హైదరాబాద్ లోనే కొనసాగుతోంది. అలాగని సినీ పరిశ్రమలో సమస్యలన్నీ పరిష్కారం అయిపోలేదు. రాష్ట్ర విభజన తరువాత సినీ పరిశ్రమలో కూడా ఆంధ్రా, తెలంగాణా సినీ పరిశ్రమలుగా విభజన ఏర్పడినప్పటికీ, భౌగోళిక హద్దులు గీసి రాష్ట్రాలను విడదీసినట్లుగా సినీపరిశ్రమను కూడా విడదీయలేకపోయారు.
అవిభాజ్యమయిన ఆ కళారంగాన్ని ప్రాంతాలవారిగా విడదీయడం కష్టమే కానీ దానిలో ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు తదితరులు పనిచేస్తున్న కారణంగా వారి మధ్య తరచూ విభేదాలు ఏర్పడుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ మొదటి నుండి ఆంధ్రాకి చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణుల చేతిలోనే ఎదగడం చేత దానిపై వారి ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంటుంది. సినీ పరిశ్రమలో ఉన్న తెలంగాణావారు అందుకు అభ్యంతరం చెప్పడం లేదు కానీ తమకు న్యాయంగా దక్కవలసిన ఉపాది అవకాశాలు దక్కకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ తెలంగాణా గడ్డపై నిర్మించబడుతున్న ప్రతీ సినిమాలో తప్పనిసరిగా 40 శాతం ఉపాధి అవకాశాలు తమకు ఇవ్వాలని వారు కోరుతున్నారు. కానీ వారి ఈ అభ్యర్ధనలను సినీ పరిశ్రమలో వినేవారే లేకపోవడంతో పరిశ్రమలో పెద్దలకు, రాష్ట్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించేందుకు తెలంగాణా ప్రాంతానికి చెందిన జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్, స్టంట్, మేకప్, లైటింగ్ తదితర కార్మికులు, సాంకేతిక నిపుణులు కలిసి సుమారు 3,000 మందితో ఈనెల 6వ తేదీన హైదరాబాద్ లో బారీ నిరసన ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఆ తరువాత ఫిలిం ఛాంబర్ వద్ద బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సినీ పరిశ్రమలోని 24 శాఖలకు చెందినవారు కూడా దీనిలో పాల్గొనబోతున్నారు.
డ్యాన్సర్స్ అసోసియేషన్స్ ప్రధాన కార్యదర్శి బషీర్ మాట్లాడుతూ “చాలా ఏళ్లుగా సినీ పరిశ్రమలో మాకు అన్యాయం జరుగుతున్నా సహిస్తూనే ఉన్నాము. కానీ ఇకపై సహించేది లేదు,” అని చెప్పారు.
“మా తెలంగాణా రాష్ట్రంలో సినిమాలు తీస్తూ మళ్ళీ మాపైనే నిషేధాలు, షరతులు విధించడానికి వారెవరు? ఇక్కడ తీసే ఏ సినిమాలో అయినా పనిచేసే హక్కు మాకుంటుంది. దానిని ఎవరూ ప్రశ్నించలేరు..అడ్డుకోలేరు. ఈ సమస్య గురించి మేము చాలాసార్లు సినీ పరిశ్రమలో ఆంధ్రా నిర్మాతలు, దర్శకుల దృష్టికి తెచ్చాము కానీ ఎవరూ పట్టించుకోలేదు. అందుకే మేము మా హక్కులను కాపాడుకోవడానికి పోరాటం చేయవలసి వస్తోంది. తెలంగాణా రాష్ట్ర కార్మిక శాఖ కూడా మా పోరాటానికి మద్దతు పలుకుతోంది, మాకు న్యాయం జరగాలని కోరుకొంటోంది,” అని మేకప్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు.
“ఈ విభేధాల వలన అందరికీ నష్టం కలుగుతోందనే ఉద్దేశ్యంతో ఈ సమస్య పరిష్కారానికి మేము చాలా సార్లు ప్రయత్నించాము కానీ ఫలితం కనబడ లేదు. మా స్థాయిలో ఈ సమస్య పరిష్కారం కావడం లేదు కనుక రాష్ట్ర ప్రభుత్వమే సినీ పరిశ్రమలో తెలంగాణావారికి తప్పనిసరిగా 40 శాతం అవకాశాలు కల్పించాలని ఒక జి.ఓ.జారీ చేయాలని కోరుతున్నాము. హైదరాబాద్ లో షూటింగ్ కోసం వచ్చే హిందీ, తమిళ చిత్ర నిర్మాతలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నపుడు ఇక్కడే స్థిరపడిన తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా దీనిని అమలు చేయడానికి ఎవరికీ ఇబ్బంది, అభ్యంతరాలు ఉండవనే నేను అనుకొంటున్నాను. తెలుగు సినీ పరిశ్రమపైనే ఆధారపడిన వేలాది మంది తెలంగాణా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ఇతర శాఖలకు చెందినవారికి జీవనోపాధి దొరుకుతుంది,” అని తెలంగాణా సినీ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి అన్నారు.