కాంగ్రెస్ పార్టీ తరచూ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ ఆమెతో యుద్దానికి దిగుతుంటుంది. అందుకు కారణం ఆమె గత ఎన్నికలలో అమేధీ నుండి తమ యువనేత రాహుల్ గాంధిపై పోటీ చేయడమే కావచ్చును. రాహుల్ చేతిలో ఆమె స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు లేకుంటే అది ఆయనకి, కాంగ్రెస్ అధిష్టానానికి, పార్టీకి కూడా చాలా అవమానకరంగా ఉండేది. ఈసారి పార్లమెంటు సమావేశాలలో కూడా ఆమెకి కాంగ్రెస్ పార్టీ నేతలకి మధ్య చాలా వాగ్వాదాలు జరిగాయి. ఆమె ఈరోజు ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లోని బీజేపీ యువమోర్చ సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ రాహుల్ గాంధి పేరు ప్రస్తావించకుండా వ్యంగ్యంగా విమర్శించారు.
“మన ప్రతిపక్ష పార్టీలలో ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు. అతనికి 50ఏళ్ల వయసొస్తున్నా ఇంకా తను యువనేతననే చెప్పుకొంటాడు. ఆయన పార్టీలో వారు కూడా ఆయనని అలాగే సంభోదిస్తుంటారు. పదేళ్ళ పాటు అమేధీకి ఆయన ప్రాతినిధ్యం వహించిన ఆ నియోజకవర్గ పరిస్థితిలో మార్పు లేదు. పదేళ్ళ క్రితం ఎలాగుందో ఇప్పటికీ అది అలాగే ఉంది. నేను ఆయనలాగ కబుర్లు చెప్పి సరిపెట్టను. నేను పోటీ చేసిన ఆ నియోజకవర్గంలో నేను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే నా గురించి వివరిస్తాయి,” అని స్మృతీ ఇరానీ చెప్పారు.
రాహుల్ గాంధి గత పదేళ్లుగా అమేధీ నియోజక వర్గం నుండి ఎంపిగా పోటీ చేసి గెలుస్తున్నారు. తరచూ తన నియోజక వర్గాన్ని సందర్శిస్తూనే ఉంటారు కూడా. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆయన ఎవరో ఒక నిరుపేద గుడిసెలోకి దూరి వారితో కలిసి గంజి త్రాగుతూ, చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఆశుభ్రంగా ఉన్న వారి పిల్లలను ఎత్తుకొని వారి ముక్కు చీమిడి తుడుస్తూ ఫొటోలకి ఫోజులిస్తుంటారు కూడా. అయితే పదేళ్ళుగా వారు ఆ గుడిసెలలోనే కటిక దారిద్ర్యంతో జీవించవలసి రావడానికి కారణం తనే అనే విషయం మరిచిపోతున్నారు. అమేధీ వంటి ఒక చిన్న నియోజక వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి పదేళ్ళు చాల ఎక్కువేనని చెప్పక తప్పదు. పదేళ్ళలో అక్కడి నిరుపేద ప్రజలకి విద్య, వైద్య, ఉపాధి అవకాశాలను కల్పించి ఉండి ఉంటే తప్పకుండా వారి జీవన ప్రమాణాలు పెరిగి ఉండేవి. అప్పుడు ఆయన వారి గుడిసెల్లో దూరి గంజి ఆయన త్రాగవలసిన దుస్థితి ఉండేదే కాదు. పదేళ్ళ వ్యవధిలో వారి జీవితాలను ఆయన మార్చగలిగి ఉండి ఉంటే అదే వారి పట్ల ఆయన నిబద్ధతకు, అభిమానానికి నిదర్శనంగా నిలిచి ఉండేది. కానీ నేటికీ అమేధీలోని కటిక దరిద్రం అనుభవిస్తున్న నిరుపేదల గుడిసెల్లో దూరి, వారి చేతిలో గంజి కూడా లాక్కొని ఆయన త్రాగుతున్నారంటే సిగ్గు చేటు. ఆ గుడిసెల్లో వారితో కలిసి ఆయన తీసుకొంటున్న ఆ ఫొటోలే ఆయన వైఫల్యానికి, నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా భావించవచ్చును.