ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ కుమారుల కుటుంబసభ్యులు ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి. తాజా ఆయన పెద్ద కొడుకు, గుంటూరు మాజీ మేయర్ కన్నా నాగరాజు తన భార్యను వేధిస్తున్న కేసులో రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. అలాగే కన్నా నాగరాజు భార్యను కుమార్తె సహా కన్నా ఇంట్లోనే ఉండనివ్వాలని అలా ఉండనివ్వకపోతే.. ప్రతి నెలా రూ . యాభై వేలు చెల్లించాలని ఆదేశించింది.
కన్నా నాగరాజు 2006లో శ్రీలక్ష్మి కీర్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వారికి కౌషిక మానస అనే పాప ఉంది. అయితే తర్వాత కన్నా నాగరాజు తన భార్యను వేధించడం ప్రారంభించాడు. వివాహేతర బంధం పెట్టుకుని వేధించడం ప్రారంభించారని.. తనను పెళ్లి చేసుకోకపోతే.. రూ. కోట్ల కట్నం వచ్చేదని అనేవారని చెబుతూ గృహహింస కేసు పెట్టారు. 2015 నుంచి తనను ఇంట్లోకి రానివ్వడం లేదన్నారు. ఈ కేసు విచారణ జరిపిన విజయవాడ కోర్టు కన్నా లక్ష్మినారాయణ, ఆయన సతీమణి కన్నా విజయలక్ష్మి, కన్నా నాగరాజులు రూ. కోటి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
మూడు నెలల్లోపు కన్నా నాగరాజు భార్యకు ఈ రూ. కోటి అందించాలని.. అలాగే ఇంట్లో నివాస వసతి కల్పించాలని.. లేకపోతే నెలకు రూ. యాభై వేలు ఇవ్వాలని ఆదేశించారు. వైద్య ఖర్చుల కోసం మరో రూ. యాభై వేలు ఇవ్వాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మూడు నెలల్లోపు ఇవన్నీ ఇవ్వాలని లేకపోతే.. పన్నెండు శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించారు. కన్నా లక్ష్మినారాయణకు ఇద్దరు కుమారులు కాగా..ఇద్దరూ లవ్ మ్యారేజీ చేసుకున్నారు. ఇద్దరీ కుటుంబాల్లోనూ సమస్యలు వచ్చాయి. చిన్న కుమారుడు ఫణీంద్ర భార్య 2020 మేలో హైదరాబాద్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.