2.0 sameeksha, 2.o sameeksha
తెలుగు360 రేటింగ్: 3/5
ఇమేజ్‌ని మోయడం ఎంత కష్టమో రజనీకాంత్, శంకర్లను చూస్తే అర్థమవుతుంది.
ప్రతీసారీ ఓ కొత్త కథతో, హంగులతో సర్ప్రైజ్ చేయడం మాటలు కాదు.
రజనీ ఆషామాషీ డైలాగ్ చెబితే సరిపోదు
శంకర్ మామూలు సినిమాతీస్తే ఆనదు.
వాళ్లకు – అంతకు మించి కావాలి! అందుకే ఆ ప్రయత్నంలో, ఆ తాపత్రయంలో.. వాళ్ల కలలకు రెక్కలు తొడిగి గగన విహారం చేయించాలి. ఆ అన్వేషణలో ‘రోబో’ దొరికింది. సరిగ్గా రజనీ నుంచి అభిమానులు ఆశించే ‘లార్జన్ దేన్ లైఫ్’ పాత్ర అందులో కనిపించింది. శంకర్ నుంచి కోరుకునే ‘వావ్’ ఫ్యాక్టర్ అందులోనే దక్కింది. అందుకే ‘రోబో’ అందరి అంచనాల్నీ అందుకుంటూ, అందరి కలల్నీ నిజం చేస్తూ.. గొప్ప విజయాన్ని సాధించింది.
ఇప్పుడు 2.ఓ వంతు వచ్చింది.
రోబోతో ఏం ఇచ్చారో.. ‘అంతకు మించి’ రోబో 2 నుంచి కోరుకుంటారని శంకర్‌కి తెలుసు. అందుకే… నాలుగేళ్లు కష్టపడ్డాడు. ఆరొందల కోట్లు ఖర్చు పెట్టించాడు. మరి….’అంతకు మించి’న అద్భుతం ‘రోబో 2’లో కనిపించిందా? రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఈ సినిమా ఉందా?
కథ
ఈ భూమి మనుషులకే కాదు… మిగిలిన జంతువులు, పక్షులకు కూడా. కానీ… మనిషి తన స్వార్థం కోసం – టెక్నాలజీ పేరుతో, మిగిలిన జీవరాశికి చోటు లేకుండా చేస్తున్నాడు. దానిపై ఆగ్రహించిన ఓ పక్షి ప్రేమికుడి కథ ఇది. సెల్‌ఫోన్ తరంగాల వల్ల, వాటి నుంచి పుట్టే రేడియేషన్ వల్ల పక్షి జాతి నాశనం అయిపోతోంది. మరి సెల్ఫోన్లు లేకుండా చేస్తే.. సెల్‌ఫోన్ టవర్లన్నీ ధ్వంసం చేస్తే..? ఇలాంటి ఆలోచనతో పక్షిరాజు (అక్షయ్ కుమార్) చెన్నైని అతలాకుతలం చేస్తాడు. మనుషుల చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లు రెక్కలొచ్చినట్టు ఆకాశంలోకి ఎగిరిపోతుంటాయి. అవన్నీ ఓ రూపం సంతరించుకుని, కొంతమంది వ్యక్తుల్ని భయపెడుతుంటాయి. ఆ పక్షిరాజు దూకుడుని అడ్డుకోవాలంటే… చిట్టిని రంగంలోకి దింపాలని వశీకర్ (రజనీకాంత్) సలహా ఇస్తాడు. ముందు ఒప్పుకోకపోయినా… ఆ తరవాత పరిస్థితుల ప్రభావంతో చిట్టిని రీ లోడ్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. అలా మళ్లీ ప్రాణం పోసుకున్న చిట్టి పక్షిరాజు రెక్కల్ని ఎలా విరిచాడు? చెన్నై మహానగరాన్ని ఎలా కాపాడాడు? అనేదే కథ.
విశ్లేషణ
ఓ మనిషి చేతుల్లోంచి సెల్‌ఫోన్ రెక్కలొచ్చినట్టు పైకి ఎగిరిపోతే..?
– శంకర్‌కి వచ్చిన ఈ ఆలోచన నుంచే 2.ఓ కథ పుట్టింది. ఆలోచనలు రావడం వేరు, దాన్ని పేపర్‌పై రాసుకోవడం వేరు. అలా రాసుకున్న ఆలోచనల్ని వెండి తెరపై ఆవిష్కరించడం వేరు. రోబో 2.ఓ ప్రారంభ దృశ్యాలు చూస్తే.. అసలు ఇలాంటి ఐడియాలు శంకర్‌కి ఎలా వస్తాయా? అనిపిస్తుంది. దర్శకుడిగా శంకర్ ఎంచుకున్న కథ సామాన్యమైనదే. పైగా ముందే ఈ కథ గురించి ప్రేక్షకులకు తెలిసిపోయింది. ట్రైలర్లో చెప్పిన కథే… వెండి తెరపై నా కనిపించింది. ఓ రకంగా.. ప్రేక్షకుల్ని కథ విషయంలో ముందే ప్రిపేర్ చేసేశాడు శంకర్. ఇక విజువల్‌గా తన గ్రాండియర్ ని చూపించడమే తరువాయి. సూటిగా, సుత్తి లేకంఉడా కథలోకి వెళ్లిపోయిన శంకర్.. ఆ ఫ్లోకి పాటలు అడ్డు పడకుండా వాటిని సైడ్ చేసేశాడు.
సెల్ ఫోన్లన్నీ పైకి ఎగిరిపోవడం, అవన్నీ నీరులా మారి.. చెట్లుగా రూపాంతరం చెంది, పక్షిగా అవతరించి.. రకరకాలుగా భయపెట్టడం విజువల్‌గా శంకర్ ఆలోచనా విస్కృతిని చూపిస్తాయి. చిట్టి ని మళ్లీ సృష్టించి – పక్షిరాజుపైకి వదలడం దగ్గర నుంచి ఉత్కంఠత మొదలవుతుంది. రెండు సమాన శక్తులు పోరాడుకుంటుంటే ఉండే మజా… చిట్టి – పక్షిరాజుల మధ్య చూడొచ్చు. ద్వితీయార్థంలో… అక్షయ్‌కుమార్‌కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అది కాస్త సుదీర్ఘంగా సాగినా – కథకు అవసరం కాబట్టి, తప్పలేదు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వల్లే.. పక్షిరాజుపైనా కాస్తో కూస్తో సానుభూతి కలుగుతుంది. ఈ ఎపిసోడ్‌లోనే శంకర్ తన మార్క్ చూపించుకునే అవకాశం దక్కింది. తన ప్రతీ కథలోనూ ఓ సామాజిక అంశాన్ని లేవనెత్తే శంకర్… ఆ అలవాటు కొనసాగిస్తూ… ఫ్లాష్ బ్యాక్‌ని వాడుకున్నాడు. అది పూర్తయిన వెంటనే… కథ మళ్లీ యాక్షన్ మోడ్‌లో కి వెళ్లిపోతుంది. చిట్టిని అచేతుడ్ని చేసినప్పుడు 2.ఓ ని రంగంలోకి దింపడం, చివర్లో పావురాలపై సవారీ చేస్తూ.. మినీ రోబోల్ని దింపడం.. ఈ సినిమాకి హైప్ తీసుకొచ్చాయి. క్లైమాక్స్ లో అక్షయ్, రజనీల పోరులో విజువల్ ఎఫెక్ట్స్ ఔరా అనిపిస్తాయి. దాదాపు అరగంట పాటు సాగిన క్లైమాక్స్… ఈ సినిమా కోసం శంకర్ ఎంత కష్టపడ్డాడో, నిర్మాత ఎంత ఖర్చు పెట్టాడో చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది.
నెగిటీవ్ శక్తి – పాజిటీవ్ శక్తి అంటూ చెప్పిన కొన్ని సైన్స్పాఠాలు అంత త్వరగా బుర్రకు ఎక్కవు. పక్షుల ఆత్మలన్నీ ఒకే ఆత్మగా రూపాంతరం చెందడం వల్ల అంత బలమైన శక్తిగా మారాయి అన్నది శంకర్ కాన్సెప్ట్. దాన్ని కాస్త అర్థమయ్యేలా చెప్పాల్సింది. ఆత్మలకు నాశనం లేదన్నప్పుడు… దాన్ని చిట్టి అయినా, 2.ఓ అయినా ఎలా నాశనం చేస్తారు? ఇది కూడా లాజిక్‌కి అందని పాయింటే. సెకండాఫ్‌లో ముందే కత్తిరించిన సీన్లు చాలా ఉన్నట్టున్నాయి. అందుకే.. అక్కడక్కడ జంపింగ్‌లు కనిపించాయి. మరీ ముఖ్యంగా వశీకర్‌లో పక్షిరాజు ఆత్మ చేరిన తరవాత.. కొన్ని సీన్లు కత్తిరించారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. రోబోలో వశీకర్ – చిట్టి మధ్య ఎమోషనల్ బాండింగ్ చాలా బాగుంటుంది. చివర్లో చిట్టి.. తనని తాను అన్మోడ్ చేసుకుంటున్నప్పుడు.. ప్రేక్షకుల్లోనూ ఓ రకమైన ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి భావోద్వేగాలేం ఇందులో లేవు. చిట్టిని మళ్లీ రంగంలోకి దింపుతున్నప్పుడు వశీకర్ ఎంత ఉద్వేగానికి లోనవ్వాలి? అలాంటి ఛాయలేం కథలో కనిపించవు. ఆఖరికి… కథానాయికని కూడా రోబోని చేసేశారు. ఇక రొమాన్స్ ఎక్కడి నుంచి పుడుతుంది? విజువల్ ఎఫెక్ట్స్ ఒక కంపెనీ ఆధ్వర్యంలోనే జరగవు. సీన్లవారిగా కంపెనీలకు పంచేస్తుంటారు. అందుకే.. ఆ క్వాలిటీలో ఎక్కువ తక్కువలు కనిపిస్తుంటాయి. కొన్ని సీన్లు ఔరా అనిపిస్తే… ఇంకొన్ని `ఇంతేనా` అనిపిస్తాయి. శంకర్ కష్టాన్ని, విజువల్ గా ఈసినిమా స్థాయిని పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే.. త్రీడీలో చూడాలి.
నటీనటులు
ఇందులో మూడు రకాలైన రజనీలను చూడొచ్చు. ఒకటి వశీకర్. రెండు చిట్టి, మూడు 2.ఓ. ఈ మూడు దశల్లో అమితంగా ఆకట్టుకున్నది 2.ఓగానే. ప్రీ క్లైమాక్స్‌లో రజనీ విన్యాసాలు ఫ్యాన్స్‌కి నచ్చుతాయి. `నెంబర్ వన్` గురించి చెప్పేటప్పుడు రజనీ పేల్చిన డైలాగులు.. ఫ్యాన్స్‌కి కిర్రెక్కించేవే. ఇక వశీకర్, చిట్టి… `రోబో` సినిమాలో చూసినట్టే కనిపించారు. అక్షయ్‌కుమార్‌ని గ్రాఫిక్స్ మింగేశాయా? అనిపిస్తుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ వరకూ అక్షయ్‌ని దాచేశాడు శంకర్. ద్వితీయార్థంలో ఓ పదినిమిషాల పాటు అక్షయ్ ఫ్లాష్ బ్యాక్ సాగుతుంది. ఆ తరవాత మళ్లీ గ్రాఫిక్స్‌లోకి మారిపోయాడు అక్షయ్. అక్షయ్ లాంటి నటుడు ఉండడం వల్లే పక్షిరాజు పాత్రకు అంత వెయిటేజ్వచ్చింది. ఓ సోషల్ మెసేజ్‌ని కూడా పాస్ చేయగలిగాడు దర్శకుడు. అమీ జాక్సన్‌ని అందమైన రోబోగా మార్చేశాడు శంకర్. సనాని కేవలం సెల్‌ఫోన్ మాటలకే పరిమితం చేశాడు.
సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా ఉన్నతంగా ఉంది 2.ఓ. మరీ ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్. అంతర్జాతీయ నిపుణులతో రూపొందించడం వల్ల, ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం వల్ల వాటికో నిండుదనం వచ్చింది. రెహమాన్ ఇచ్చిన నేపథ్య సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. ఈమధ్య అంతర్జాతీయ చిత్రాలకు పనిచేసి, పనిచేసి మరింత రాటు దేలిన రెహమాన్.. ఆ స్థాయిలోనే ఆర్.ఆర్ అందించాడు. కథకుడిగా శంకర్ ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. తన ప్రతీ సినిమాలోనూ బలమైన కథ ఉంటుంది. అయితే.. ఈసారి కథని సాంకేతికత మింగేసిందనిపిస్తుంది. తను బలంగా నమ్మిన లైన్లోనే.. తనదైన సామాజిక అంశాన్ని జోడించి చెప్పాలనుకున్నాడు. అందుకే.. కొన్ని పరిమితలకు లోబడిపోయి ఈ కథ అల్లుకున్నాడేమో అనిపిస్తుంది.
తీర్పు
బాహుబలిలో కథ, సాంకేతికత జోడు గుర్రాల్లా సవారీ చేశాయి. 2.ఓ లో మాత్రం సాంకేతికమైన హంగులే కనిపించాయి. విజువల్‌గా సినిమా బాగుంటే చాలు.. అనుకున్నవాళ్లని 2.ఓ బాగా నచ్చుతాడు. ఇక రజనీ ఫ్యాన్స్ అంటారా…?? వాళ్లు ఆల్రెడీ కబాలి, కాలా ఎఫెక్టులతో డీలా పడ్డారు. యావరేజ్ వచ్చినా.. సూపర్ హిట్ చేసుకోవాలని ఉవ్వీళ్లూరుతున్నారు. వాళ్లకు ఈ సినిమా మాత్రం ‘త్రీడీ’లో ఆనేస్తుంది.
ఫినిషింగ్ టచ్: మరో మాయాజాలం
తెలుగు360 రేటింగ్: 3/5