జగన్ రెడ్డినే అంత అమాయకుడుగా ప్రొజెక్ట్ చేసిన మహి వి రాఘవ ఇక తనను ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తే టాలెంట్ అంతా చూపించకుండా ఉంటారా ?. రూరల్ మినీ స్టూడియో పేరుతో హార్సిలీ హిల్స్ లో ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి ప్లాన్ చేసుకున్న వ్యవహారం బయట పడిన తర్వాత ఆయన రాయలసీమ సెంటింట్ ను.. తెరపైకి తెచ్చారు. తానేదో మరుగుపడిపోయిన హార్సిలీ హిల్స్ ను ప్రపంచానికి పరిచయం చేద్దామని ఉదాత్త ఆశయంతో అక్కడ రెండెకరాలు కొట్టేద్దామని అనుకుంటూంటే మీరంతా చెడగొడుతున్నారని ఆయన ఇతరులదే తప్పన్నట్లుగా మాట్లాడుతున్నారు .
హార్సిలీ హిల్స్ భూ వ్యవహారంలో తనను తాను సమర్థించుకుంటూ మహి వి రాఘవ అలియాస్ వారణాసి మహేందర్ రెడ్డి చేసిన ట్వీట్లు ఆయన తన సినిమా స్టైల్ రచనలను చూపించారు. తన పేరు వారణాసి మహేందర్ రెడ్డి అనేది నిజమేనని ఒప్పుకుంటూ అబద్దమనేశారు. వారణాశి మహేందర్ రెడ్డి అనే పేరును తాను ఎప్పుడూ ఉపయోగించుకోలేదని దాన్ని వదిలేశానని.. తన తండ్రి పేరను కలిపి మహి వి రాఘవ్ గా మార్చుకున్నానని చెప్పుకొచ్చారు. మార్చుకున్నారా లేదా అన్నది కాదు.. ఆయన పేరు మహేందర్ రెడ్డా కాదా అన్నదే మీడియా ప్రస్తావించింది.
పైగా తన సినిమాల షూటింగ్లను తాను రాయలసీమలోనే తీస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆయన ఒక్కరే రాయలసీమలో తీయడం లేదు.. కథను బట్టి ఇండస్ట్రీలో చాలా మంది రాయలసీమలో షూట్ చేస్తున్నారు. వారందరూ.. . తమకు ఎకరాలకు ఎకరాలు ఇవ్వాలని దరఖాస్తు పెట్టలేదు కదా ! . తన సిద్దలోకం, సైతాన్, యాత్ర 2 సినిమాలను కడప, మదనపల్లిలో తీశానని చెప్పుకొచ్చారు. యాత్ర 2లో కడపలో తీయాల్సిన సినిమా .. మరి ఇంకెక్కడ తీస్తారు ?
ఇంకా చెప్పొచ్చేదేమిటంటే హార్సిలీ హిల్స్ మహి వి రాఘవ అుకున్నంత అనామకంగా ఏమీ లేదు. అక్కడ వందల కొద్దీ సినిమా షూటింగ్లు జరిగాయి. టూరిస్టులూ వేలల్లోనే వస్తూంటారు. ఆయనకు రెండు ఎకరాలు ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి చెందదు. ఇలాంటి కథలన్నీ సినిమాల్లో చెప్పుకోవడానికి పనికి వస్తాయి కానీ.. క్విడ్ ప్రో కథలకు అసలు వర్కవుట్ అవవు.
జగన్ రెడ్డి కోసం ప్రాపగాండా సినిమాలు తీసి.. ఆ పేరుతో ప్రజా ఆస్తులను కొట్టేయాలనుకోవడమే పెద్ద తప్పు..దాన్ని సమర్థించుకోవడానికి అడ్డగోలు వాదనలు చేయడం ఇంకో తప్పు. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగి..తానేదో హార్సీలీ హిల్స్ అభివృద్ధి కోసమే స్థలం అడిగానని చెప్పుకోవడం మరో వింత.. ! ఎంతైనా రెడ్డిగారు కథలు చెప్పడంలో ఎక్స్ పర్ట్ !