ఏ రంగంలో అయినా డిమాండ్ ను బట్టి వస్తువుల ఉత్పత్తి ఉంటేనే మార్కెట్ గొప్పగా ఉంటుంది. ప్రజలు ఐరన్ వస్తువులు కోరుకుంటున్నప్పుడు స్టీల్ సామాన్లు ఉత్పత్తి చేసి లగ్జరీగా ఉంటాయని … ఇవే కొనాలని అంటే… మార్కెట్ పడిపోతుంది. తాము కొనాలనుకున్నవే వినియోగదారు కొంటారు కనీ.. ఉత్పత్తి దార్లు ఉత్పత్తి చేసినవి కావు. ఈ సూత్రం రియల్ ఎస్టేట్‌కు కూడా వర్తిస్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో డిమాండ్ ఉన్న రెండు బెడ్ రూమ్ ఇళ్లను కాకుండా లగ్జరీ ఇళ్లను నిర్మిస్తూ డిమాండ్ కు దూరంగా వెళ్తున్నారు బిల్డర్లు. ఇది డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణంగా మారింది.
డబుల్ బెడ్రూం ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడిందని ఆన్ లైన్ రియల్ ఎస్టేట్ సంస్థలు చేసిన డేటా ఎనాలసిస్‌లో తేలింది. ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్-ఐరిస్ ఇండెక్స్ సర్వేలో డబుల్ బెడ్రూం అపార్ట్మెంట్ల వైపు జనం ఎక్కువగా మొగ్గు చూపినట్లుగా తేలింది. భారత్ లో అధికాదాయ వర్గాలు స్వల్పం. వ్యాపారాలు చేసేవారు, ఐటీ ఉద్యోగులు మాత్రం కాస్త ఎక్కువ ధర పెట్టి లగ్జరీ ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారు పది శాతమే ఉంటారు. మిగతా 90 శాతం మంది కుటుంబానికి ఓ నీడ ఉండాలని రెక్కలు, ముక్కలు చేసుకుని ఇళ్లు కొనుగోలు చేసేవారే.
ఆన్ లైన్ సెర్చ్‌లో అయినా… రియల్ ఎస్టేట్ బ్రోకర్ల వద్ద అయినా ఎక్కువ మంది డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసమే వాకబు చేస్తున్నారు. ఈ ఇళ్ల నిర్మాణం కూడా జోరుగా సాగుతోంది.కానీ లగ్జరీ అపార్టుమెంట్లలో డబుల్ బెడ్ రూం అయినా వచ్చే ఐదేళ్ల తర్వాత ఎంత ధర ఉంటుందో అంత ధర నిర్ణయిస్తున్నారు. దీని వల్ల అవి కూడా సామాన్యులకు దూరం అవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్‌కు అటూ ఇటూ ఇప్పుడు ఎక్కువగా ఇళ్లను నిర్మిస్తున్నారు. అందుబాటులో ఉంటున్నాయి. వాటికే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది.