‘పీఎస్వీ గరుడవేగ’తో రాజశేఖర్ స్టార్ హీరోల రేసులోకి దూసుకొచ్చారు! కంటెంట్ వున్న సినిమా పడితే కలెక్షన్లు రాబట్టడం తనకు పెద్ద కష్టం కాదని నిరూపించారు. దాంతో నిర్మాతలకు ఆయన మీద నమ్మకం పెరిగింది. ‘పీఎస్వీ గరుడవేగ’ తరవాత చాలామంది దర్శక నిర్మాతలు రాజశేఖర్‌తో సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ఆయన ఆలోచించి ఆలోచించి ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించారు. రాజశేఖర్ కుమార్తెలతో కలిసి ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకి ‘కల్కి’ అనే పేరు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 19 నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. హైదరాబాద్‌లోని పటాన్‌చెరువులో రెండు కోట్ల రూపాయలతో భారీ సెట్ వేశారు. కీలక సన్నివేశాలను ఈ సెట్లో తీయనున్నారు. ఇందులో రాజశేఖర్ పోలీస్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే!!