హైదరాబాద్: ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి మహా లడ్డు ప్రసాదం పంపిణీ ముందు ప్రకటించినట్లే ఇవాళ ఉదయం ప్రారంభమయింది. ప్రసాదంకోసం తెల్లవారుఝామునుంచే భక్తలు పెద్దసంఖ్యలో గణేశ మంటపంవద్ద బారులు తీరారు. దాదాపు రెండు కిలోమీటర్లమేర క్యూ ఏర్పడింది. అయితే భక్తులు ఇంత పెద్దసంఖ్యలో వస్తారని ఊహించని నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవటంతో వలన అక్కడ భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. భక్తులతోపాటు అక్కడ విధులలో ఉన్న పోలీసులుకూడా ఎగబడటంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు లాఠీఛార్జి చేయాల్సివచ్చింది. పలువురు భక్తులకు గాయాలయ్యాయి. ప్రసాదంకోసం గతఏడాదికంటే ఈసారి విపరీతంగా భక్తులు వచ్చారు. కవర్లలో పంపిణీ చేస్తామని ముందు ప్రకటించిన నిర్వాహకులు అలాంటి ఏర్పాట్లేమీ చేయలేదు.
ఖైరతాబాద్‌లో భాగ్యనగర్ గణేశ ఉత్సవ కమిటీ ఈ ఏడాది 59 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ వినాయకుడికోసం తూర్పుగోదావరిజిల్లాలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ సంస్థ 5,600 కేజీల లడ్డును తయారు చేసింది. విగ్రహాన్ని మొన్న నిమజ్జనం చేసిన తర్వాత లడ్డును భద్రపరిచిన నిర్వాహకులు ఇవాళ ఆ ప్రసాదాన్ని పంపిణీ చేయటానికి ఏర్పాట్లు చేశారు.