తెలంగాణ ధాన్యాగారమైంది. ప్రపంచం మొత్తం ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందని.. వస్తున్న విశ్లేషణల మధ్యలో… తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి కాంతిరేఖలా మారింది. చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ వ్యవసాయ ఉత్పత్తిని తెలంగాణ సాధించింది. దేశానికి అన్నపూర్ణగా మారింది. తెలంగాణలో వ్యవసాయ సీజన్లను వర్షాకాలం, యాసంగి సీజన్లుగా మార్చారు. ఈ రెండు సీజన్లలో అంతకు ముందు ఏడాది దిగుబడితో పోలిస్తే.. 85శాతం అధిక దిగుబడి వచ్చింది. గత ఏడాది వర్షాలు ఆశాజనకంగా పడ్డాయి. రైతులకు కావాల్సినంత విద్యుత్ అందించడంతో.. బోర్ల మీద ఆధారపడిన పంటలు కూడా భారీగా పండాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వతా 2019-20లో మొదటి సారి పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. వివిధ రకాల సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో మొత్తం వర్షాకాలం, యాసంగి సీజన్లు కలిపి కోటి పది లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 2018-19 వ్యవసాయ సీజన్లతో పోలిస్తే… 46శాతం అధిక విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. దీంతో రెండు కోట్ల 41 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే దాదాపుగా డబుల్ . 2018-19లో కోటి 30ర లక్షల టన్నుల మాత్రమే దిగుబడి వచ్చింది. రెండు కోట్ల టన్నులకుపైగా వ్యవసాయ దిగుబడులు రావడం… ఉమ్మడి రాష్ట్రంలో అయినా… ప్రత్యేక తెలంగాణలో అయినా ఇదే ప్రధమం.
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. వైరస్ కారణంగా వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సమయం కేటాయించి సమీక్షలు చేస్తున్నారు. నిధుల సమస్య రానీయడం లేదు. వైరస్ లేకపోతే.. డాన్స్ చేసేంత పంట వచ్చిందని కేసీఆర్ ప్రెస్మీట్లోనే చెప్పారు. దేశానికి తిండిగింజల కొరత లేకుండా.. తెలంగాణ రైతులు పంట దిగుబడి సాధించారు. ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన లక్ష్యంతో అది సాధ్యమైంది.