శంషాబాద్‌లోని సమతా కేంద్రంలో జరుగుతున్న యజ్ఞయాగాలకు లక్ష కిలోలకు పైగా నెయ్యి వాడుతున్నారన్న ప్రచారం చాలా మందిని అబ్బుర పరుస్తోంది. దానికో రేటు పెట్టారు అది వేరే విషయం. ఎవరి వాదనలు ఎలా ఉన్నా సమతా కేంద్రం వద్ద కనీవినీ ఎరుగని రీతిలో హోమాలు.. కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీఐపీలు వస్తున్నారు. త్వరలో తెలంగాణలో అంతకు మించిన అధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది. అదే యాదాద్రి ఆలయ పున:ప్రారంభోత్సవం. కేసీఆర్ ప్రత్యేకంగా యాదాద్రిని పరిశీలించి ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఎలా చేయాలో అధికారులకు దిశానిర్దేశం చేసి వచ్చారు.
వచ్చే నెల మొత్తం యాదాద్రి హడావుడే ఎక్కువగా కనిపించనుంది. మార్చి 28 వ తేదీన మహా కుంభ సంప్రోక్షణకు 8రోజుల ముందునుంచి అంటే మార్చి 21వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, పీఠాధిపతులు యోగులు, స్వామీజీలను ఆహ్వానిస్తున్నారు. మహా సుదర్శన యాగంలో 10వేల మంది రుత్విజులు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం కూడా చినజీయర్ చేతుల మీదుగానే సాగనుంది.
యాదాద్రి యాగం దేశం మొత్తం ఆకర్షించనుంది. ఎందుకంటే అక్కడ యజ్ఞగుండాల్లో రెండు లక్షల కిలోల ఆవు నెయ్యిని వేయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ సీఎం అధికారులను ఆదేశించారు. యజ్ఞగుండాల్లో వేసే నెయ్యే ఆ స్థాయిలో ఉంటే ఇక మిగతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. హిందూ సమాజం మొత్తం కేసీఆర్ వైపు చూసేలా యాదాద్రి ఆలయ పునప్రారంభోత్సవం ఉండనుంది.