మీడియా సంస్థల అధినేత రామోజీరావు కరోనాపై పోరుకు ప్రభుత్వాలకు విరాళం ఇచ్చారు. ఏపీ, తెలంగాణలకు చెరో రూ. పది కోట్ల రూపాయలను అందించారు. మిగతా చాలా మంది చేస్తున్నట్లుగా మొదటగా ప్రకటనలు.. ఆ తర్వాత తీరిక ఉన్నప్పుడు.. స్వయంగా వెళ్లి సీఎంలకు చెక్కులు ఇచ్చి ఫోటోలు తీసుకునే విధానంలో కాక.. ఆర్టీజీఎస్ ద్వారా నేరుగా.. సీఎం రిలీఫ్ ఫండ్లకు ట్రాన్స్ఫర్ చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉన్నందున.. వాటిని ఉల్లంఘించకూడదని.. రామోజీ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. విపత్తలు సంభవించినప్పుడు.. ఈనాడు గ్రూప్.. ఇలా పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వడమే కాకుండా.. పాఠకుల్ని నుంచి సేకరించి.. స్వయంగా సహాయ కార్యక్రమాలు చేపడుతుంది. ఎక్కువగా ఇళ్లు నిర్మించి ఇస్తుంది. కేరళలో.. విశాఖలో అలాగే నిర్మించి ఇచ్చింది. అయితే.. ఈ సారి వచ్చిన ఉత్పాతం భిన్నమైనది కాబట్టి.. ప్రభుత్వానికే నేరుగా విరాళం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
నిజానికి కరోనా దెబ్బకు తీవ్రంగా నష్టపోతున్న వ్యాపారాల్లో రామోజీరావు గ్రూప్ ఉంటుంది. ఈనాడు గ్రూప్‌కు ఆర్థికంగా ఆయువు పట్టు లాంటి ఈనాడు దినపత్రిక పరిస్థితి ఇప్పుడు డొలాయమానంలో పడింది. పత్రికలు పట్టుకుంటే కరోనా వస్తుందన్న ప్రచారంతో ప్రజలు వాటిని కొనడం లేదు. డిస్ట్రిబ్యూటర్లు పంపిణీ చేయడం లేదు. అన్ని రకాల వ్యాపారాలు లాక్ డౌన్ కారణంగా ఆగిపోవడంతో.. పత్రికకు ప్రకటనలు కూడా రావడం లేదు. అదే సమయంలో… రామోజీ ఫిల్మ్ సిటీ కూడా.. లాక్ డౌన్ కారణంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఫిల్మ్ సిటీ నిర్వహణ అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది. కొన్ని వేల మంది ఉద్యోగులు ఉంటారు. లాక్ డౌన్ కారణంగా.. ఆదాయం లేదని.. జీతాలు తగ్గించడం లాంటి పనులు రామోజీ గ్రూప్‌లో చేయరు. మొత్తం జీతాలు నిన్ననే చెల్లించారు.
తీవ్రమైన ఆర్థిక కష్టానష్టాలు ఎదుర్కొంటున్నా…రామోజీరావు.. తన వంతుగా.. రాష్ట్రానికి రూ. పది కోట్లు చొప్పున.. ఇరవై కోట్లు.. విరాళం అందించారు. ప్రభుత్వాల నుంచి వేల కోట్లు కాంట్రాక్టులు పొందిన బడా కాంట్రాక్టర్లు రూ. ఐదు కోట్ల విరాళం ఇవ్వడానికి ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో వెళ్లి… ముఖ్యమంత్రులకు చెక్ ఇచ్చి.. ఫోటోలు తీసుకుని..మీడియాలో విపరీతంగా ప్రచారం చేయించుకుంటున్న సందర్భం ఇది. లాక్ డౌన్ వల్ల ఆయా కాంట్రాక్టర్లు నష్టపోయేదేమీ ఉండదు. కానీ వ్యాపార పరంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ.. రామోజీరావు రూ. 20 కోట్లు విరాళం ఇచ్చారు.